తెలంగాణ వార్తలు

జనగామ జిల్లాలో పులి సంచారం.. ఒంటరిగా బయటకు రావొద్దని గ్రామాల్లో చాటింపు..

  • మండెలగూడెం ప్రాంతంలో లేగదూడను చంపి తిన్న పులి
  • చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారి హెచ్చరిక
  • సాయంత్రం ఐదు తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న అధికారులు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో పులి సంచరిస్తుందనే వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన పులి సిద్దిపేటలోని జగదేవ్‌పూర్, ఆలేరు మండలం మీదుగా జనగామ జిల్లాల్లోకి ప్రవేశించిందనే వార్తలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలోని రఘునాథ్‌పల్లి మండలం, మండెలగూడెం గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు దాని అడుగుల ద్వారా గుర్తించినట్లు జనగామ మరియు హన్మకొండ అటవీ శాఖ అధికారి లావణ్య పత్రికా ప్రకటన విడుదల చేశారు. మండెలగూడం సమీపంలోని తండాలో పులి ఒక లేగదూడను చంపి తిన్నట్లు అధికారులు గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారి సూచించారు.

గ్రామాల్లో చాటింపు

పులి సంచారం నేపథ్యంలో జనగామ జిల్లాల్లోని పలు గ్రామాల్లో చాటింపు వేశారు. పులి సమీప ప్రాంతాల్లో తిరుగుతున్నందున అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, సాధ్యమైనంత వరకు గుంపులు గుంపులుగా రావాలని అధికారులు పలు గ్రామాల్లో చాటింపు వేశారు. ముఖ్యంగా, సాయంత్రం ఐదు తర్వాత అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. పశువులను ఇంటి వద్ద సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. మండెలగూడెం, మచ్చుపహాడ్, కొత్తగూడెం, ఖిలాషాపురం తదితర గ్రామాల్లో చాటింపు వేశారు.

జనగామ జిల్లాలోని లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, తరిగొప్పుల, దేవరప్పుల తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించవద్దని అధికారులు, పోలీసులు సూచించారు. పులి సంచారానికి సంబంధించి సమాచారం తెలిస్తే అటవీ శాఖ అధికారులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారి లావణ్య సూచించారు.

Related posts

లంకె బిందెల పేరిట టోకరా… దొంగ బాబా అరెస్ట్…

Ram Narayana

స్వరాష్ట్రం కోసం పోరాడం, దెబ్బలు తిన్నాం, జైళ్ళకెళ్ళాం మమ్మలను ఆదుకోండి…తెలంగాణ ఉద్యమకారులు …

Ram Narayana

జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌!

Ram Narayana