ఆరోగ్యం

బీపీకి రోజూ మాత్రలు వద్దు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు!

  • అధిక రక్తపోటుకు మాత్రల బదులు ఇంజెక్షన్లతో చికిత్స
  • ఏడాదికి రెండు డోసులతో బీపీని నియంత్రించేలా పరిశోధనలు
  • చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ‘జిలేబెసిరాన్’   
  • దీని భద్రత, ఖరీదుపై వైద్య నిపుణుల భిన్నాభిప్రాయాలు

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) నియంత్రణలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. రోజూ మాత్రలు వేసుకునే అవసరం లేకుండా, సంవత్సరానికి కేవలం రెండు ఇంజెక్షన్లతో బీపీని అదుపులో ఉంచే సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌పై ప్రముఖ వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ ఒక సమీక్షను ప్రచురించింది.

ప్రస్తుతం ప్రయోగాల చివరి దశలో ఉన్న ‘జిలేబెసిరాన్’ అనే ఔషధం ఈ కొత్త ఆశలకు కారణమవుతోంది. రోష్, ఆల్నైలామ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ ఇంజెక్షన్‌ను ఒక్కసారి తీసుకుంటే, ఆరు నెలల వరకు రక్తపోటును అదుపులో ఉంచుతుందని పరిశోధనల్లో తేలింది. ఇది కాలేయంలో రక్తపోటును నియంత్రించే ‘యాంజియోటెన్సినోజెన్’ అనే ప్రొటీన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. రోజూ మందులు వేసుకోవడంలో విసుగు, నిర్లక్ష్యం కారణంగా బీపీ అదుపులో ఉండని వారికి ఈ చికిత్స ఒక వరంలా మారుతుందని భావిస్తున్నారు.

ఈ కొత్త చికిత్సపై వైద్య నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ అమిత్ రాజ్ మాట్లాడుతూ “ఇది రక్తపోటు చికిత్సలో ఒక పెద్ద మార్పు కావచ్చు. వ్యాధి మూలాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఈ విధానం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ల భారం తగ్గే అవకాశం ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, ఎయిమ్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితీశ్ నాయక్ మాత్రం దీనిపై ఆచితూచి స్పందించారు. “ఇది శుభపరిణామమే అయినా, దీన్ని ఒక గేమ్‌ఛేంజర్‌గా చెప్పలేం. దీని ఖరీదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పేద, మధ్యతరగతి దేశాల్లో ఇది ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూడాలి. దీని దీర్ఘకాలిక భద్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది” అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఔషధంపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని, ఇది అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్లు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Related posts

ఏపీ మంత్రి బొత్సకు బైపాస్ సర్జరీ

Ram Narayana

మధుమేహంతో భారత్‌కు ‘ఆర్ధిక’ ముప్పు!

Ram Narayana

పరగడపున పండ్లు తింటే కలిగే ప్రయోజనాలివే..!

Ram Narayana