నూతన మేయర్, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్లతో పాటు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు , నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సిరిపురపు లలిత (కాంగ్రెస్)లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఆయన అభినందించారు. మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోట ధనమూర్తి, సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, వైరా చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఏదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరిలకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు తెలుపుతూ.. వారంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని సూచించారు.
పట్టణాల్లోని ప్రతి వార్డు, డివిజన్ అభివృద్ధి చెందాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కూడిన పూర్తి పాలకవర్గం పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులు, డివిజన్లలోని మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన పాలకవర్గాలు పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.