అంతర్జాతీయం

అమెరికా ‘యూ-వీసా’ కోసం అడ్డదారి.. 11 మంది భారతీయుల అరెస్ట్

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందేందుకు కొత్త తరహా మోసానికి పాల్పడిన 11 మంది భారతీయ పౌరులను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీసా మోసం కోసం కుట్ర పన్నారన్న ఆరోపణలపై వారిపై కేసు నమోదు చేశారు. నాటకీయంగా సాయుధ దోపిడీలు సృష్టించి, తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం ద్వారా ప్రత్యేక వీసాలు పొందడానికి వీరు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

అమెరికా చట్టాల ప్రకారం తీవ్రమైన నేరాల బారిన పడి, దర్యాప్తు సంస్థలకు సహకరించిన వారికి ‘యూ-వీసా’ జారీ చేస్తారు. ఈ వీసాను పొందేందుకే నిందితులు నకిలీ దోపిడీల నాటకానికి తెరలేపినట్లు బోస్టన్‌లోని ఫెడరల్ దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కన్వీనియన్స్ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఇలాంటి ఆరు నకిలీ దోపిడీలను వీరు పకడ్బందీగా నిర్వహించినట్లు గుర్తించారు.

పథకం ప్రకారం ఒక వ్యక్తి నకిలీ దొంగగా దుకాణంలోకి ప్రవేశించి, తుపాకీలాంటి వస్తువుతో బెదిరించి కౌంటర్‌లోని నగదు తీసుకుని పారిపోతాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యేలా చూసుకుంటారు. ఆ తర్వాత, దుకాణంలోని ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా 5 నిమిషాలు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇస్తాడు. ఈ నాటకంలో బాధితులుగా నటించేందుకు కొంతమంది డబ్బులు చెల్లించినట్లు, ఆ డబ్బును నిర్వాహకులు దుకాణ యజమానులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మసాచుసెట్స్‌, కెంటకీ, మిస్సౌరీ, ఒహైయో రాష్ట్రాల్లో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో తదుపరి విచారణ బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో జరగనుంది. వీరిపై నేరం రుజువైతే, గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 250,000 డాల‌ర్ల (రూ. 2.29కోట్లు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, చట్ట ప్రకారం కోర్టులో నేరం రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే పరిగణిస్తారు. ఎఫ్‌బీఐ, ఇమ్మిగ్రేషన్ విభాగం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

Related posts

ఆస్కార్ కు వేళాయె… ముఖ్యమైన నామినేషన్స్ ఇవిగో!

Ram Narayana

భారత్‌కు రష్యా భరోసా: గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన సాయానికి సిద్ధం…

Ram Narayana

ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్ కొత్త ప్రతిపాదన!

Ram Narayana