జాతీయ వార్తలు

దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత… సామాన్యులకు తప్పిన భారం

దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే, సామాన్యులు వినియోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం స్థిరంగా ఉంచడం ఊరట కలిగించే అంశం. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్ పీసీఎల్) తమ ప్రీమియం రకం పెట్రోల్ ధరలను లీటర్‌కు సుమారు రూ.2 నుంచి రూ.2.30 వరకు పెంచాయి. ఈ కొత్త ధరలు మార్చి 20, శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి.

పెట్రోల్ బంకుల డీలర్ల సమాచారం ప్రకారం, ఐఓసీఎల్ కు చెందిన ‘ఎక్స్ పీ 95’, హెచ్ పీసీఎల్ కు చెందిన ‘పవర్’ పెట్రోల్ వంటి హై-ఆక్టేన్ ఇంధనాలపై ఈ పెంపు వర్తిస్తుంది. ఉదాహరణకు, పూణేలో ప్రీమియం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.111.68 నుంచి రూ.113.77కి చేరింది. ఈ పెంపు ప్రభావం ప్రధానంగా లగ్జరీ కార్లు, హై-పెర్ఫార్మెన్స్ బైకులు, స్పోర్ట్స్ వాహనాలు వినియోగించే వారిపైనే ఉంటుంది. సాధారణ వాహనదారులు వాడే రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే స్థిరంగా కొనసాగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై ఆందోళనలు పెరగడం ఈ పెంపునకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తన చమురు అవసరాల్లో అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గడంతో దిగుమతి వ్యయం కంపెనీలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో, పెరిగిన వ్యయ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా, కేవలం ప్రీమియం ఇంధనాల ధరలను మాత్రమే పెంచడం ద్వారా కంపెనీలు నష్టాలను సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇంధన సరఫరాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని హెచ్‌పీసీఎల్ స్పష్టం చేసింది. “క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. అదనపు కార్గోలు ఇప్పటికే దేశానికి చేరుకుంటున్నాయి. సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉంది” అని కంపెనీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ, భారత్‌లో సాధారణ ఇంధనాల ధరలు చాలాకాలంగా స్థిరంగా ఉండటం గమనార్హం. తాజా పెంపు ప్రీమియం వినియోగదారులకు కొంత భారం కానుండగా, సామాన్య ప్రజలపై దీని ప్రభావం దాదాపుగా శూన్యం.

ఇండస్ట్రియల్ డీజిల్ ధరల మోత… లీటర్ పై ఏకంగా రూ.22 పెంపు

Industrial Diesel Price Hike Rs 22 per Litre Increase

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో వాడే బల్క్ డీజిల్ (ఇండస్ట్రియల్ డీజిల్) ధరను లీటరుకు ఏకంగా రూ.22.03 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

శుక్రవారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో లీటరు ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.87.57 నుంచి రూ.109.59కి చేరింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా తన ధరలను సవరించింది. 

సాధారణ వాహనాల్లో కాకుండా ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, నిర్మాణ రంగంలోని భారీ యంత్రాలు, జనరేటర్లలో ఈ ఇండస్ట్రియల్ డీజిల్‌ను వినియోగిస్తారు. దీని ధర పెరగడం వల్ల పరిశ్రమల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఈ భారం పరోక్షంగా రవాణా, ఇతర వ్యాపార కార్యకలాపాలపై పడి చివరికి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, స్పీడ్, పవర్ వంటి ప్రీమియం పెట్రోల్ రకాల ధరలను కూడా లీటరుకు రూ.2.09 మేర పెంచారు.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.

Related posts

సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం… వీడియో ఇదిగో

Ram Narayana

ఆడ, మగ విద్యార్థులు కలసి కూర్చోవద్దు.. హుకుం జారీ చేసిన బీహార్ కాలేజీ

Ram Narayana

పాస్ పోర్ట్ కావాలంటే నెలకు పైగా వేచి చూడాల్సిందే!

Drukpadam