Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖతర్‌‌ను వీడి.. ఆఫ్ఘనిస్థాన్‌కు పయనమైన తాలిబన్ అగ్రనేత!

ఖతర్‌‌ను వీడి.. ఆఫ్ఘనిస్థాన్‌కు పయనమైన తాలిబన్ అగ్రనేత!
ఖతర్ మంత్రితో బరాదర్ సమావేశం
ఆఫ్ఘన్‌లో తాజా పరిస్థితులు, అధికార మార్పిడిపై చర్చ
తాలిబన్లు ఆప్ఘన్‌ను స్వాధీనం చేసుకోవడం వెనక బరాదర్ వ్యూహం
ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి ఏ దేశానికీ హాని జరగదు: హామీ ఇచ్చిన తాలిబన్లు
ఆఫ్ఘన్‌లో సంక్షోభం అమెరికా పుణ్యమే: చైనా విమర్శ

ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్ అగ్రనేత, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నిన్న ఖతర్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ బయలుదేరినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఖతర్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థనీ, అబ్దుల్ ఘనీ మధ్య కీలక సమావేశం జరిగింది. ఆఫ్ఘన్ తాజా పరిణామాలు, అధికార మార్పిడి, ప్రజా రక్షణ, కొత్త ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించడం.. వంటి అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది.

తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా ‘దోహా శాంతి’ ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా వెళ్లిపోయిన తర్వాత తాలిబన్లు విరుచుకుపడి ఒక్కో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగడం వెనక ఆయన వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో ఇన్నాళ్లూ ఖతర్‌లో ఉన్న ముల్లా ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌కు బయలుదేరినట్టు చెబుతున్నారు.

ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి ఏ దేశానికీ హాని జరగదు: హామీ ఇచ్చిన తాలిబన్లు

 

అమెరికా సైన్యం వెళ్లిపోయిన పదిరోజుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. తాలిబన్ దళాలు ఆ దేశాన్ని మెరుపు వేగంతో తమ వశం చేసుకున్నాయి. ఈ క్రమంలో భయంతో వణికిపోయిన ప్రజలు ఆఫ్ఘనిస్థాన్ ను వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంతటి అలజడులు దేశవ్యాప్తంగా జరుగుతుండగా.. తాలిబన్లు తమ మొట్టమొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన తాలిబన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి ప్రపంచంలోని ఏ దేశానికీ ఎటువంటి హానీ జరగదని, ఈ విషయంలో ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రపంచానికి వాగ్దానం చేస్తోందని జబీబుల్లా తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాలిబన్ సైన్యాలు అధికారికంగా ఆఫ్ఘనిస్థాన్ పాలనను ఇంకా తీసుకోలేదు. దీంతో ఇస్లామిక్ ఎమిరేట్స్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు.

అందరూ కలిసి ఉండే ప్రభుత్వాన్నే తాము ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జబీబుల్లా చెప్పారు. దేశంలో కానీ, దేశం బయట కానీ తమకు శత్రువులు వుండరని చెప్పిన ఆయన.. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. తమ నాయకుల ఆదేశాల మేరకు అందర్నీ తాము క్షమించామని చెప్పారు. ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవడం జరగదని హామీ ఇచ్చిన ఆయన.. పాశ్చాత్య దళాలతో పనిచేసిన మాజీ మిలటరీ అధికారులపై కూడా ఎటువంటి చర్యలూ ఉండబోవని స్పష్టంచేశారు. ‘ఎవరూ వచ్చి మీ ఇళ్లు తనిఖీ చేయరు’ అని ప్రకటించారు.

అలాగే ఆఫ్ఘన్ ప్రజల విలువలకు అనుగుణంగా చట్టాలు చేసుకునే అధికారం తమకుందని, ప్రపంచ దేశాలు కూడా వాటిని గౌరవించాలని జబీబుల్లా కోరారు. మహిళలపై కూడా ఎలాంటి వివక్ష చూపడం జరగదని చెప్పిన ఆయన.. ఇస్లాం ఆధారంగా మహిళలకు హక్కులు కల్పిస్తామని చెప్పారు. అవసరమైన రంగాల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

ఆఫ్ఘన్‌లో సంక్షోభం అమెరికా పుణ్యమే: చైనా విమర్శ

 

మరోపక్క ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికానే కారణమని చైనా ఆరోపించింది. ఆఫ్ఘనిస్థాన్‌ను భయంకరమైన అయోమయంలో ఉంచి అమెరికా బలగాలు వెళ్లిపోయాయని డ్రాగన్ దేశం అంటోంది. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.

అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌ను వీడిన తర్వాత తాలిబన్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత తాలిబన్ దళాలు వేగంగా ఆఫ్ఘనిస్థాన్‌ను తమ వశం చేసుకున్నాయి. అయితే అమెరికా దళాలు అర్థాంతరంగా వెళ్లిపోయి, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇలాంటి పరిస్థితులు సృష్టించడంపై బైడెన్ మాట్లాడుతూ.. తన నిర్ణయం సరైందేనని అన్నారు. ఆఫ్ఘన్ సైనికులు తమ కోసం తాము పోరాడలేదని, అందుకే ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయిందని ఆయన విమర్శించారు.

అయితే చైనా మాత్రం ఆఫ్ఘన్ సంక్షోభానికి అమెరికానే కారణమని అంటోంది. అలజడి, భేదభావం, నాశనమైన కుటుంబాలు.. ఇవే అమెరికా మిగిల్చిందని చైనా ఆరోపించింది. ‘అమెరికా శక్తి, పాత్ర రెండూ నాశనంలోనే కానీ, నిర్మాణంలో ఎక్కడా ఉపయోగపడలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు.

నేడు మీడియాతో మాట్లాడిన ఆమె అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి చైనా అంగీకరించింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో సాయం చేస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే ఇక్కడ మరోసారి తీవ్రవాదులు చేరకుండా చూసుకోవాలని తాలిబన్లకు సూచించింది.

Related posts

Drukpadam

వైఎస్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనని డౌటు: ఎంపీ మోపిదేవి

Drukpadam

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మోహన్ బాబు!

Drukpadam

Leave a Comment