అంతర్జాతీయం

శాంతి చర్చల వేళ చైనాపై అమెరికా సంచలన ఆరోపణ!

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ అమెరికా తన నిఘా వర్గాలను ఉటంకిస్తూ చైనాపై సంచలన ఆరోపణలు చేసింది. డ్రాగన్ కంట్రీ ఇరాన్‌కు రహస్యంగా విమాన విధ్వంసక క్షిపణులను సరఫరా చేస్తోందని ఆరోపించింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అమెరికా నిఘా వర్గాల ప్రకారం.. చైనా నుంచి ఇరాన్‌కు మ్యాన్‌ప్యాడ్స్ అందుతున్నాయి. భుజంపై నుంచి ప్రయోగించే ఈ క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయాణించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను సులభంగా కూల్చివేయగలవు. అంతర్జాతీయంగా విమర్శలు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను నేరుగా కాకుండా మూడో దేశం ద్వారా ఇరాన్‌కు చేరవేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ సమయాన్ని ఇరాన్ తన ఆయుధ సంపత్తిని తిరిగి సమకూర్చుకోవడానికి ఉపయోగించుకుంటోందని అమెరికా అనుమానిస్తోంది. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే ఈ క్షిపణులు అమెరికా విమానాలకు పెను ముప్పుగా మారతాయని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ‘మమ్మల్ని మోసం చేయాలని చూడొద్దు’ అని జేడీ వాన్స్ ఇప్పటికే ఇరాన్‌ను గట్టిగా హెచ్చరించారు.

అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తాము ఏ దేశానికీ ఆయుధాలు సరఫరా చేయడం లేదని, బాధ్యతాయుతమైన దేశంగా శాంతి చర్చలకే మద్దతిస్తామని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ తాజా పరిణామాలతో ఇస్లామాబాద్ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. చైనా తన వైఖరి మార్చుకోకపోతే, వచ్చే నెలలో జరగాల్సిన ట్రంప్-జిన్‌పింగ్ భేటీపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

అమెరికా కలలు కల్లలు.. రూ. 57 లక్షలు పోగొట్టుకుని, 14 నెలలు జైల్లో.. బేడీలతో భారత్‌కు హర్యానా యువకులు

Ram Narayana

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. 42 మంది భారత యాత్రికుల సజీవ దహనం..

Ram Narayana

ఈ మధ్యే పుట్టిన కొత్త కొత్త దేశాలేవో తెలుసా?

Ram Narayana