- పెట్రోల్ బంక్‌లో యువకుల బైక్ స్టంట్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం
- అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు చేసిన విన్యాసం వికటించిన వీడియో వైరల్
- ‘వీలింగ్స్’ తల్లిదండ్రులకు కన్నీటి ‘ఫీలింగ్స్’ మిగల్చొద్దంటూ హితవు
- ప్రమాదకర ప్రదేశాల్లో స్టంట్లు మూర్ఖత్వమని హెచ్చరిక
- బాధ్యతగా మెలగాలని యువతకు సజ్జనార్ సూచన
యువత రోడ్లపై చేసే ప్రమాదకర బైక్ విన్యాసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి తీవ్రంగా స్పందించారు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో కొందరు యువకులు చేసిన బైక్ స్టంట్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, యువతకు ఆయన గట్టిగా హితవు పలికారు.
వివరాల్లోకి వెళితే, ఓ పెట్రోల్ బంకు వద్ద అమ్మాయిలను చూసి ఇద్దరు యువకులు బైక్‌పై వీలింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ స్టంట్ వికటించి మరో బైక్ ను ఢీకొట్టారు. దీంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఓ వ్యక్తి ఆ యువకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వీడియోను పంచుకుంటూ సజ్జనార్ తనదైన శైలిలో స్పందించారు. “వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!? గుర్తుంచుకోండి.. మీరు చేసే వీలింగ్స్ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి ఫీలింగ్స్ మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి” అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. క్షణికావేశంలో చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని యువతకు సూచించారు.