- సంక్రాంతి తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్న సీఎం రేవంత్
- ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులుంటాయని ప్రజలకు అప్రమత్తం
- ప్రాజెక్టుల్లోని నీళ్లు తాగునీటికే సరిపోతాయని స్పష్టీకరణ
- రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచన
- గడ్డం పెంచుకున్నంత మాత్రాన తనలా మారలేరంటూ కేటీఆర్‌పై విమర్శలు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోతాయని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినోపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందరం కలిసికట్టుగా పరిస్థితులను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం ప్రకటించారు. మూడు రోజుల కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం హకీంపేట, దుద్యాల మండలాల్లో రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉంటే తెలంగాణలోనే కరవు వచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని రేవంత్ విమర్శించారు. బావబామ్మర్దులు ఊళ్లపై పడి అబద్ధాలు చెబుతారని, వారి మాటలు విని రైతులు నష్టపోవద్దని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు.
మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వెళ్తున్నాయన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదని సీఎం అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 16 టీఎంసీల నీరు ఉంటేనే కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు దించే పరిస్థితి కూడా లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి వల్లే ఈ మూడు బ్యారేజీలు పనిచేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన దేవాదుల, వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టులే ప్రస్తుతం రైతులకు, ఖమ్మం జిల్లాకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
పాలమూరు నుంచి గెలిచిన కేసీఆర్ భారీ బడ్జెట్ ఖర్చు చేసినా అక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని రేవంత్ విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి పేరు, స్థలం, అంచనాలు మార్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలనలోనే కూలిపోయిందని ఆరోపించారు. వచ్చే డిసెంబరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి కోరుతున్నామని, ఆ సమావేశాల్లో ఎల్‌నినో, కాళేశ్వరం అంశాలపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకం అంచనాలు పెంచడంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలకూ సీఎం సమాధానమిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొడంగల్ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం ఇస్తోందన్నారు. హైదరాబాద్-లగచర్ల ప్రాంతాన్ని ఢిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. హకీంపేటలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
కేటీఆర్ వేషభాషలు మార్చుకున్నా ప్రజలు నమ్మరని రేవంత్ ఎద్దేవా చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన తనలా మారలేరని వ్యాఖ్యానించారు. తాను మూడేళ్లుగా గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్న కుటుంబాన్ని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: