ఖమ్మం- నల్గొండ- వరంగల్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు సిపిఐ( ఎం ) మద్దతు…తమ్మినేని
ప్రజల గొంతుకగా పని చేసే పీడీఎఫ్ అభ్యర్థి నే గెలిపించాలి:
జెన్-జీ ఉద్యమాలకు కమ్యూనిస్టులే స్ఫూర్తి
కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ లేదు
ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి ఎర్రజెండానే.. సీపీఐ (ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
అన్ని వర్గాల ప్రజల గొంతుకగా గళమెత్తుతా: కొల్లి సత్యనారాయణ
వామపక్షాల వాణిని వినిపించే గొంతుకగా మండలిలో కొల్లి సత్యనారాయణ పనిచేస్తారని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు .ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల సిపిఎం ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు .
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల వారసత్వం కొనసాగేలా ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణను గెలిపించి శాసన మండలికి పంపిస్తే, సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజల గొంతుకగా పనిచేస్తారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఖమ్మం లోని సిపిఐ ( ఎం ) జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల సన్నాహాక సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.
కొల్లి సత్యనారాయణకు సీపీఎం పార్టీ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీడీఎఫ్ అభ్యర్థులుగా గెలిచి ప్రజల కోసం పనిచేసిన చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, లక్ష్మణ్ రావు, గేయానంద్, నర్సిరెడ్డి వంటి వారి వారసత్వాన్ని కొనసాగించేలా ప్రజాసంఘాల మద్దతు, ప్రగతిశీల శక్తుల అండతో ముందుకు వస్తున్న కొల్లి సత్యనారాయణ గెలుపు కోసం సీపీఎం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు. వైఆర్ కే, బోడేపూడి రాధాకృష్ణ కమ్యూనిస్ట్ కుటుంబ నేపథ్యం ఉన్న కొల్లి సత్యనారాయణ గెలిపిస్తే అనేక ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా ఉంటారన్నారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకూ, సీనియర్ న్యాయవాది గా, బార్ కౌన్సిల్ సభ్యుడిగా నిజాయితీగా సేవలందించిన చరిత్ర కొల్లి సత్యనారాయణ కు ఉందన్నారు.
దేశంలో కమ్యూనిస్టులు లేరని కొందరు అంటున్నారని, కానీ కమ్యూనిస్టుల భవిష్యత్తు కంటే కమ్యూనిస్టులు లేకపోతే దేశానికే భవిష్యత్తు లేదని తమ్మినేని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం లెఫ్ట్ భావజాలం ఆధిపత్యంలోకి వస్తోందని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాల ప్రజలు వామపక్ష భావజాలంతో ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్, శ్రీలంకలో కమ్యూనిస్టు అధ్యక్షుడి గెలుపు, వెనిజులా వంటి దేశాల్లో వామపక్ష అభ్యర్థులు గెలుస్తున్న అంశాన్ని ప్రస్తావించారు.
దేశంలో ఉద్యమాలు జెన్జీ పేరుతో నడవొచ్చు కానీ, జెన్జీ యువత లేవనెత్తిన అజెండా కమ్యూనిస్టుల అజెండా అని తమ్మినేని తెలిపారు. గత అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై ఏ నినాదాలు ఇచ్చారో, ఆ నినాదాలను ఇప్పుడు జెన్జీ తరం స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ పార్టీపై ఉద్యమం చేస్తోందని అన్నారు.
ఏ ఉద్యమానికైనా ఎర్రజెండానే స్ఫూర్తి
దేశంలో ఏ ప్రజా ఉద్యమానికైనా ప్రధాన స్ఫూర్తి ఎర్రజెండానే అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని తమ్మినేని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. ఆ అసంతృప్తిని ప్రశ్నించగలిగే నాయకుడు పీడీఎఫ్ అభ్యర్థి అని చెప్పారు.
సత్యనారాయణ విజయానికి సీపీఎం సర్వశక్తులూ ఒడ్డుతుంది: జాన్ వెస్లీ
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి సత్యనారాయణను గెలిపించేందుకు సీపీఎం కృషి చేస్తుందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్రజెండా శక్తిని చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇవ్వకుండా ప్రజాసంఘాలు బలపర్చిన అభ్యర్థిగా ముందుకు వస్తున్న సత్యనారాయణ వెంట నిలబడతామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సీపీఎం పార్టీని సంప్రదించినప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థికే తమ మద్దతు అని తేల్చి చెప్పారు.
హైదరాబాద్ స్థానానికి సంబంధించి బీజేపీని ఓడించగల రాజకీయ శక్తికి మద్దతు ఇచ్చే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని జాన్ వెస్లీ వివరించారు. సిపిఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ
రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నల్గొండ కేంద్రంగా లక్షలాది మందితో జరిగిన జాతీయ రైతు సభ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిందని పేర్కొన్నారు.
ప్రజల గొంతుకగా ఉంటా : కొల్లి
ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తనను గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రజల గొంతుకగా గళ మెత్తుతానని చెప్పారు. ప్రజల పక్షంగా ఉండి, ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజాభ్యుదయానికి శ్రామిస్తానన్నారు. అన్ని వర్గాలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆత్మగా పని చేస్తానన్నారు. అన్ని ప్రజా సంఘాలు, వామ పక్ష పార్టీల సూచనలు సలహాలు, భాగస్వామ్యం తో త్వరలోనే మ్యానిఫెస్టో ను తయారు చేసి, విడుదల చేస్తానని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే,సీపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి, నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్, ఎండీ జహంగీర్ తో పాటు వివిధ జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు ( ఖమ్మం ), మచ్చా వెంకటేశ్వర్లు (భద్రాద్రి కొత్తగూడెం), మల్లు నాగార్జున రెడ్డి (సూర్యాపేట), సాదుల శ్రీనివాస్ (మహబూబాబాద్), కనకారెడ్డి (జనగామ), ప్రభాకర్ రెడ్డి (హనుమకొండ), సాంబశివ (ములుగు), సిద్దిపేట జిల్లా నాయకులు శశిధర్, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్లరావు,బండి రమేష్, వై. విక్రమ్, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ,టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: