Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలపై కేసీఆర్.. సిరిసిల్ల వర్ష బీభత్సంపై కేటీఆర్ సమీక్షలు!

భారీ వర్షాలపై కేసీఆర్.. సిరిసిల్ల వర్ష బీభత్సంపై కేటీఆర్ సమీక్షలు!
-తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
-ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
-జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
-ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. జలదిగ్బంధంలో సిరిసిల్ల
-కలెక్టరేట్‌లోకీ నీళ్లు …విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వర్షాలు, వరదలపై అక్కడి నుంచే సమీక్ష నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.

సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అధికారులంతా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

భారీ వర్షంతో సిరిసిల్ల పట్టణం అతలాకుతలం కేటీఆర్ సమీక్ష

మరోవైపు కుండపోత వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద పోటెత్తింది. పట్టణం నిండు చెరువును తలపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరదనీరు పలు కాలనీల్లోకి వచ్చి చేరుతోందని… సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. దీంతో వినాయక చవితి కోసం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన విగ్రహాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

మరోవైపు, బోనాల చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ప్రజలు భయపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, శాతవాహన వర్సిటీలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు, కలెక్టరేట్‌లోకి నీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు.

Related posts

సరదా కోసం శారీరక సంబంధాలకు దిగజారే స్థితికి మనదేశ యువతులు ఇంకా చేరుకోలేదు: మధ్యప్రదేశ్ హైకోర్టు!

Drukpadam

ట్విట్టర్ ,భారత్ ప్రభుత్వం మధ్య వార్ …….

Drukpadam

జర్నలిస్ట్ హెల్త్ కార్డు సేవలను త్వరలో పరిష్కరిస్తా … ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు!

Drukpadam

Leave a Comment