బద్వేలు ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా పనతల సురేశ్
- అధిష్ఠానం ఎంపిక చేసిందన్న వీర్రాజు
- పోటీకి దూరంగా జనసేన
- టీడీపీ కూడా ఎన్నికకు దూరం
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలో, ఈ ఎన్నిక బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థి పేరును బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తమ పార్టీ తరఫున పనతల సురేశ్ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. అభ్యర్థి పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు వివరించారు.
‘వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోంది బీజేపీ. 14 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా, గత 5 సంవత్సరాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేశ్ పనతల గారిని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది’ అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
‘బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి, మీ సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేయగల ఒక యువనాయకుడిని గెలిపించుకోవాలని కోరుతున్నాను’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
మరోపక్క, ఈ ఎన్నిక బరిలో తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టబోమని ఇప్పటికే జనసేన ప్రకటించింది. అయితే, బీజేపీ అభ్యర్థికి ఆ పార్టీ మద్దతు ఇచ్చే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టబోమని ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థులు, కొన్ని చిన్న పార్టీల నేతలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు.