వరంగల్ లో టీఆర్ఎస్ విజయగర్జన సభకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకి: మరోసారి సభ వాయిదా!
-వరంగల్ లో టీఆర్ఎస్ విజయగర్జన సభ మరోసారి వాయిదా టీఆర్ యస్ శ్రేణుల్లో నిరాశ
-ఈ నెల 29న సభ జరపాలని భావించిన టీఆర్ఎస్
-వరంగల్ వద్ద ఏర్పాట్లును చకచకా చేస్తున్న టీరియస్
-ఏర్పాట్లలో నిమగ్నమైన ఎర్రబెల్లి …సడన్ గా వాయిదా అనే కబురు
-ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..కోడ్ అమలు
ఈ నెల 29న వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ నిర్వహించాలని భావించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడడంతో అడ్డంకిగా మారింది . దీంతో అట్టహాసంగా జరపాలని భావించిన విజయ గర్జన సభ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడమే అందుకు కారణం. వాస్తవానికి ఈ నెల 15నే వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని భావించారు. అయితే దీక్షా దివస్ నేపథ్యంలో ఈ నెల 29న విజయ గర్జన సభ జరపాలని నిర్ణయించారు. రెండు సార్లు సభ వాయిదా పడటంతో టీఆర్ యస్ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడింది.
దీనికోసం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ ఉదయం సభాస్థలిని కూడా పరిశీలించారు. 12 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సభ కోసం 300 ఎకరాలు, వాహనాల పార్కింగ్ కోసమే 1,500 ఎకరాలు సేకరించినట్టు వివరించారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ మధ్యాహ్నం విడుదల కావడంతో విజయ గర్జన సభకు కోడ్ అడ్డంకిగా మారింది.
అంతేకాదు, ఈ బుధవారం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించాల్సి ఉండగా, ఆ పర్యటన కూడా వాయిదా పడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబరు 10న జరగనున్నాయి.