బీజేపీ సర్కార్ పై రాజ్యసభలో ఎంపీ జయాబచ్చన్ ఫైర్…
బీజేపీ కు రోజులు దగ్గర పడ్డాయని వార్నింగ్
పనామా పేపర్ల లీక్ కేసులో తమ కుటుంబాన్ని లగడంపై ఆగ్రహం
విపక్షాలు ,బీజేపీ సభ్యులమధ్య మాటల యుద్ధం
ఇది మీ ఇల్లు కాదన్నా చైర్ స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలిత
పనామా పేపర్స్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణకు హాజరైన అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సమయంలో ఆమె అత్త,ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ ఇవాళ పార్లమెంట్ వేదికగా బీజేపీపై ఫైర్ అయ్యారు.
తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని ఆమె హెచ్చరించారు.
సోమవారం రాజ్యసభలో మాదక ద్రవ్యాల బిల్లుపై చర్చ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడారు. మాకు న్యాయం కావాలి. అక్కడి నుంచి న్యాయం ఆశించడం లేదు.. కానీ మీ నుంచి ఆశించగలమా? సభలోని సభ్యులను లేదా బయట కూర్చున్న 12 మంది సభ్యులను మీరు ఎలా కాపాడుతున్నారు? మీరు వారిని ఎలా రక్షిస్తున్నారు? అని సభను నడుపుతున్న చైర్మన్ భువనేశ్వర్ కలిత ను ఉద్దేశించి అన్నారు. అయితే జయా బచ్చన్ మాదక ద్రవ్యాల బిల్లుపై మాట్లాడటం లేదని చైర్మన్ గుర్తు చేశారు. బిల్లుపై మీకు ఆసక్తి లేదనిపిస్తున్నదని అన్నారు.
ఈ క్రమంలో చుట్టుపక్కలున్న సభ్యులు పెద్దగా నిరసన వ్యక్తం చేయగా ట్రెజరీ బెంచీల లక్ష్యంగా జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోంది? ఇది భయంకరం అని మండిపడ్డారు. మీకు చెడ్డ రోజులు త్వరలో వస్తాయి అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. చైర్‌ను లక్ష్యంగా చేసుకుని జయా బచ్చన్ ఆరోపణలు చేశారని అన్నారు. దీంతో సభ్యుల మధ్య మాటల వాగ్వాదం మొదలైంది. కాగా, రాకేశ్ సిన్హా తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని జయా బచ్చన్ ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయగా ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని చైర్మన్ ప్రకటించారు.
అయితే, మీకు గొడవ చేయాలనే ఉద్దేశం ఉంటే, ఇది ఇల్లు కాదు. ఐ యామ్ వెరీ సారి. నేను తదుపరి స్పీకర్‌ని పిలుస్తున్నాను అని చైర్మన్ భువనేశ్వర్ కలిత అనడంతో జయా బచ్చన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోని వారు వ్యక్తిగత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? బయట కూర్చున్న సహోద్యోగుల పట్ల మీకు తగిన బుద్ధి లేదా గౌరవం లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు.