నిన్న పుతిన్ కు పొగడ్త.. ఇప్పుడు దాడిపై ట్రంప్ స్పందన.. దానికి వైట్ హౌస్ కౌంటర్!
- ఉక్రెయిన్ పై దాడి ప్రపంచానికి దుర్దినం
- తాను ఉండి ఉంటే దాడి జరగనిచ్చేవాడిని కాదన్న ట్రంప్
- పుతిన్ ను పొగిడిన వారి సలహాలు అవసరం లేదన్న వైట్ హౌస్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను నిన్న పొగిడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అదే నోటితో రష్యా దాడిని ఖండించారు. ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయడం ప్రపంచానికి దుర్దినమంటూ వ్యాఖ్యానించారు. తానుండుంటే ఈ దాడి జరిగి ఉండేదే కాదన్నారు. ఉక్రెయిన్ మీద దాడి జరిగి ఉండాల్సింది కాదని, తన ప్రభుత్వం ఉంటే దాడిని ఆపేదని అన్నారు. ఈ దాడుల వల్ల ఎందరో అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ట్రంప్ వన్నీ బూటకపు మాటలని వైట్ హౌస్ కౌంటర్ ఇచ్చింది. అంత బాధపడిపోతే నిన్న పుతిన్ ను ఎందుకు అంతలా పొగిడారంటూ ప్రశ్నించింది. పుతిన్ ను ప్రశంసించే వారి దగ్గర్నుంచి తమకు ఎలాంటి సలహాలూ అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా బైడెన్ నిర్ణయాలను తీసుకుంటున్నారని, రష్యా దుందుడుకు చర్యలపై ప్రపంచం మొత్తాన్ని కూడగడుతున్నారని వ్యాఖ్యానించారు.