- ఢిల్లీలోని జహంగీర్ పూర్ లో అల్లర్లపై పవార్ మండిపాటు
- అమిత్‌షా విఫలమయ్యారని విమర్శ
- కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారన్న పవార్
- కానీ అక్కడి పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారని వ్యాఖ్య
ఢిల్లీలోని జహంగీర్ పూర్ లో హనుమాన్ జయంతి వేళ చోటు చేసుకున్న మతపరమైన అల్లర్లపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ… ఆ అల్లర్లను ఆపడంలో అమిత్‌షా విఫలమయ్యారని విమర్శించారు. సీఎం కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ అక్కడి పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చూస్తున్నారని తెలిపారు.
ఆ ఘర్షణలను అమిత్ షా ఆపలేకపోయారని, ఆయన విఫలమయ్యారని చెప్పారు. ఢిల్లీలో ఏ చిన్న ఘటన జరిగినా, ఆ విషయం ప్రపంచమంతా తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రించలేకపోతోందని విమర్శించారు.