టెస్టు క్రికెట్ ను ఉత్సాహభరితంగా మార్చే సత్తా ఈ ఆటగాడికి ఉంది: సెహ్వాగ్!
- పృథ్వీ షాపై సెహ్వాగ్ ప్రశంసల జల్లు
- పంత్ ఆటతీరుకూ కితాబు
- వీరిద్దరూ ఉంటే టీమిండియా ఓ పవర్ హౌస్ అవుతుందని వెల్లడి
టీమిండియా క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ టెస్టు క్రికెట్ పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. ముంబయి యువకిశోరం పృథ్వీ షా టెస్టు క్రికెట్ ను ఉత్సాహభరితంగా మార్చే సత్తా ఉన్న ఆటగాడు అని కొనియాడాడు. పృథ్వీ షాతో పాటు రిషబ్ పంత్ కూడా టెస్టులను రసవత్తరంగా మార్చేయగలడని తెలిపాడు. వీరిద్దరూ ఉంటే భారత్ టెస్టుల్లో ఓ పవర్ హౌస్ అవుతుందని అన్నాడు.
ఈ జోడీ జట్టులో ఉంటే… 400 పరుగులు చేసినా చాలదు అని ప్రత్యర్థి జట్లు భావిస్తాయని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. పృథ్వీ షా, పంత్ జట్టులో ఉంటే భారత్ టెస్టు చాంపియన్ షిప్ గెలవడమే కాదు, ప్రపంచ టెస్టు క్రికెట్ నే శాసించే స్థితికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
22 ఏళ్ల పృథ్వీ షా 2018లో వెస్టిండీస్ పై రాజ్ కోట్ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు. అయితే, 2020-21 సీజన్ లో ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. షా ఇప్పటివరకు 5 టెస్టుల్లో 42.37 సగటుతో 339 పరుగులు సాధించాడు.