తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్, అసోంలో ముగిసిన పోలింగ్
- నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు
- తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు
- అసోంలో చివరి విడత పోలింగ్
- పశ్చిమ బెంగాల్ లో మూడో విడత
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు నిర్వహించిన పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధిక సంఖ్యలో పార్టీలకు సమరాంగణంగా మారిన తమిళనాడులో సాయంత్రం 6 గంటల సమయానికి 64.92 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో నేటి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి లోపించింది. సాయంత్రం వరకు అదే ఒరవడి కొనసాగడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు.
కేరళలో సాయంత్రం 5 గంటల సమయానికి 69.95 శాతం ఓటింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటల సమయానికి 77.90 శాతం ఓటింగ్ జరిగింది. మూడో విడత పోలింగ్ జరుపుకున్న బెంగాల్ లో సాయంత్రం 5 గంటల వరకు 77.68 శాతం పోలింగ్ జరిగింది. బెంగాల్ లో ఈ విడతలో 31 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది విడత పోలింగ్ జరుపుకున్న అసోంలో సాయంత్రం 5 గంటల సమయానికి 78.94 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.