Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ద్రౌపది ముర్ము నామినేషన్…ప్రధాని మోడీ మొదటి సంతకం … వైసీపీ, బీజూ జనతదాళ్ మద్దతు..

చారిత్రాత్మక ఘట్టం.. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు
నామినేషన్ పత్రాలపై తొలుత పీఎం మోదీ సంతకం
తర్వాత అమిత్ షా, రాజ్ నాథ్, నడ్డా సంతకాలు
హాజరైన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు
వైసీపీ, బీజూ జనతదాళ్ మద్దతు

ఇక ద్రౌపది ముర్ము ఎన్నిక సునాయాసమే

 

ఝార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశాకు చెందిన బీజేపీ నేత ద్రౌపది ముర్ము అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కూడా పాల్గొన్నారు.

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని మొదటగా ప్రధాని మోదీ ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలపై మోదీతోపాటు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా సంతకాలు చేశారు.

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పోటీ చేయనుండడం తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు పలికాయి. దీంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా సునాయాసంగా ఎన్నిక కానున్నారు.

ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 10,86,431 కాగా, ఎన్డీయేకి 5,32,351 ఓట్లు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు 45,550 ఓట్లు, బీజేడీకి 31,686 ఓట్లు, అన్నాడీఎంకేకు 14,940 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ముర్ముకే పడనున్నాయి. చిన్న వయసులోనే (64) రాష్ట్రపతిగా ఎన్నికైన మహిళగా ముర్ము చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించే తొలి గిరిజన మహిళ కూడా ఆమే అవుతారు.

అంతకుముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, మిస్రా ముండా విగ్రహాల వద్ద ఆమె నివాళులు అర్పించారు.

మొదటి ప్రతిపాదన ప్రధాని మోడీది..

ముర్ము పేరుని మొదటిగా ప్రధాని మోడీ ప్రతిపాదించారు. ఆ తర్వాత రెండవ వ్యక్తిగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలపరిచారు. ద్వితీయస్థాయి ప్రతిపాదకుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మూడవ స్థాయి బలపరిచినవారిలో హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇక నాలుగవ స్థాయి ప్రతిపాదకుల్లో గుజరాత్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు కాకపోయిన వైయస్సార్ కాంగ్రెస్, బీజూ జనతా దళ్(బీజేడీ) లీడర్లు ముర్ము నామినేషన్‌కు మద్ధతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వం, ఎం.తంబి దొరై, జేడీ-యూ రాజీవ్ రంజన్ సింగ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా జులై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవికాలం జులై 24, 2022న ముగియనుంది.

సోనియా గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్‌లకు ద్రౌపతి ముర్ము ఫోన్..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్‌కు ముందు కీలకమైన విపక్షనేతలకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో ఆమె మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ముర్ము కోరారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలూ ముర్ముకు శుభాభినందనలు తెలియజేశారు.

Related posts

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

Drukpadam

కిడ్నాప్ అయ్యాననుకుని.. ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన మహిళ…

Drukpadam

మనది త్యాగాల గుణం పోరాటాల వారసత్వం ఉన్న సంఘం…విరాహతలి

Drukpadam

Leave a Comment