పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువును 2024కు పొడిగించిన కేంద్రం!
-పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించిన టీడీపీ ఎంపీ కనకమేడల
-రాజ్యసభకు రాతపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ
-ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పూర్తి కావాల్సి ఉందని వ్యాఖ్య
-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమని వెల్లడి
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 2024 జులై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాధ్యపడుతుందని కేంద్ర జల శక్తి శాఖ మంగళవారం పార్లమెంటులో ఓ ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాజ్యసభలో రాతపూర్వక సమాదానం చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని అందులో కేంద్రం వెల్లడించింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జల శక్తి శాఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఆరోపించింది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లోపభూయిష్టంగా ఉందని విమర్శించింది. కరోనా కూడా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణంగా నిలిచిందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు గడువును మరోమారు పొడిగించక తప్పడం లేదని కేంద్రం వెల్లడించింది.