ముఖేశ్ అంబానీ, ఆయన ఫ్యామిలీకి భద్రత కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు!
- అంబానీకి కల్పిస్తున్న భద్రతను ప్రశ్నిస్తూ త్రిపుర హైకోర్టులో పిల్
- అంబానీ ఫ్యామిలీకి పొంచి ఉన్న ముప్పుపై నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు
- ఇప్పటికే త్రిపుర హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు
- తాజాగా భద్రతను కొనసాగించాల్సిందేనని స్పష్టత నిచ్చిన వైనం
భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కొనసాగించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంబానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్లకు కొనసాగుతున్న భద్రతపై త్రిపుర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఇప్పటికే స్టే విధించిన సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం అంబానీ ఫ్యామిలీకి కొనసాగుతున్న భద్రతపై స్పష్టత నిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమాచారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖేశ్‌తో పాటు ఆయన భార్య, ఆయన పిల్లలకు పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా భద్రతను కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంబానీ, ఆయన ఫ్యామిలీకి కొనసాగుతున్న భద్రతను సవాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు… అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు పొంచి ఉన్న ముప్పునకు సంబంధించిన నివేదికను అందజేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.