జగన్‌ను కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలి!… కేసీఆర్‌కు సీపీఐ నారాయణ సలహా!
- -బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాట్లను స్వాగతించిన నారాయణ
- -అమిత్‌షాను కలవాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్‌కు ఏముందని ప్రశ్న
- -టీఆర్ఎస్‌ను బలహీనపరచేందుకే బీజేపీ నేతలు సినీ తారలను కలుస్తున్నారని ఆరోపణ
జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీని కూడా నారాయణ స్వాగతించారు. ఈ క్రమంలో, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని కేసీఆర్‌కు నారాయణ సలహా ఇచ్చారు.
సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్‌లోని మగ్ధూం భవన్‌లో మీడియాతో మాట్లాడిన నారాయణ… తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ నేతలు వరుసబెట్టి సినిమా హీరోలను కలుస్తున్న వైనంపై స్పందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన తెలంగాణ టూర్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ భేటీపై నారాయణ స్పందిస్తూ.. గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సినిమా తారలను ప్రసన్నం చేసుకుంటున్న బీజేపీ… వారి ద్వారానే తెలంగాణలో టీఆర్ఎస్‌ను బలహీనపరచాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.