- ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు….
-బాగా ఇష్టమైన ప్రదేశంలోనే రెబల్ స్టార్ దహన సంస్కారాలు
-తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణంరాజు
-కరోనా అనంతరం సమస్యలతో క్షీణించిన ఆరోగ్యం
-ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
-కనకమామిడి ఫాంహౌస్ లో అంత్యక్రియలు
-పెదనాన్నకు తలకొరివి పెట్టిన ప్రబోధ్
సీనియర్ నటుడు, రాజకీయవేత్త కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. మొయినాబాద్ లోని కనకమామిడి ఫాంహౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ చేశారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ పెదనాన్న కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు.
కృష్ణంరాజు అంత్యక్రియలకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులను, ప్రముఖులను, బంధుమిత్రులను, అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోకి పంపించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగే చోటుకు వచ్చారు.
కాగా, కనకమామిడి ఫాంహౌస్ కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఫాంహౌస్ లోనే శేషజీవితం గడపాలని భావించి, ఇంటి నిర్మాణానికి కూడా పూనుకున్నారు. అయితే విధి మరోలా తలచి కృష్ణంరాజును అందరికీ దూరం చేసింది. ఈ నేపథ్యంలో, ఆయనకు బాగా నచ్చిన కనకమామిడి ఫాంహౌస్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
కృష్ణంరాజు మధుమేహం తదితర అనారోగ్య సమస్యలతో చాలాకాలం నుంచి బాధపడుతున్నారు. అయితే, కరోనా సోకగా, తదనంతర సమస్యలతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై కన్నుమూశారు.