దేవుడి పథకాలు వేరేగా ఉంటాయి.. బ్రదర్ అనిల్ కుమార్!
-మరోసారి రెచ్చకెక్కిన షర్మిల ,జగన్ విభేదాలు
-ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దని హితవు
-భీమిలిలో ప్రార్థన కూడికకు హాజరైన బ్రదర్ అనిల్ కుమార్
-జగన్ పేరు, ఆయన పార్టీ పేరు ఎత్తకుండానే విమర్శలు
-పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారన్న అనిల్ కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలంలోని ‘క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్’లో నిన్న నిర్వహించిన ప్రార్థన కూడికకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దని ప్రజలకు సూచించారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని అన్నారు.
ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎక్కడా ముఖ్యమంత్రి పేరుగానీ, వైఎస్సార్ సీపీ గురించి కానీ ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. గత ఏడాది కూడా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.