జ్వరం వచ్చిన వెంటనే మాత్ర వేసేస్తున్నారా?.. అది మంచిది కాదంటున్న వైద్యులు!
- దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు
- కాలేయం దెబ్బతినే ప్రమాదం
- యాంటీ బయాటిక్ నిరోధకత రిస్క్
- మూడు రోజులు వేచి చూడడం మంచిది
- తగ్గకపోతే వైద్యుల సలహానే ఉత్తమం
సీజన్ (రుతువు మారే కాలం) మారినప్పుడు మన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వాతావరణ పరిస్థితులకు శరీరంలో సర్దుబాటు జరిగే క్రమంలో జలుబు, జ్వరం కనిపిస్తుంటాయి. కానీ, మనలో చాలా మంది నేడు జ్వరం కనిపించిన వెంటనే ఒక మాత్ర వేసేస్తున్నారు. అలా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం సీజన్ మారినప్పుడే కాకుండా.. శరీరం అలసిపోయినప్పుడు కూడా జ్వరం కనిపిస్తుందని చెబుతున్నారు. ‘‘జ్వరం రెండు రోజులకు పైగా కొనసాగితే, వైద్యుల సలహా లేకుండా ఔషధ సేవనం మంచిది కాదని లుధియానా క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఇంటర్నల్ మెడిసిన్ విభాగం నిపుణుడు డాక్టర్ ఎరిక్ విలియమ్స్ సూచించారు. నిజానికి జ్వరం అన్నది కేవలం డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా తదితర సమస్యల్లోనే కనిపిస్తుందనుకోవడం పొరపాటు. ‘‘కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలం ప్రయాణం చేసిన వారిలో జ్వరం కనిపిస్తుంది. ఇది అలసట వల్ల వచ్చేది. అలాంటి సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ముందులు తీసుకోవడం దీర్ఘకాలంలో చేటు చేస్తుంది’’ అని డాక్టర్ ఎరిక్ విలియమ్స్ సూచించారు.
దుష్ప్రభావాలు
దుష్ప్రభావాలు లేని ఔషధం ఉంటుందని అనుకోవద్దని ఢిల్లీ ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ మనోజ్ శర్మ పేర్కొన్నారు. ‘‘పారాసెటమాల్ ను దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడదు. కానీ, ఇది కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. విషంగా మారి కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. కొద్ది పాటి జ్వరం కనిపించినా ఔషధం తీసుకుంటే, దీర్ఘకాలంలో వాటిపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది’’ అని వివరించారు. జ్వరం, నొప్పులు కనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం మంచి పరిష్కారమన్నారు.
ఔషధం తీసుకుని వైద్యుల వద్దకు వస్తే జ్వరం తీరును విశ్లేషించడం కష్టమని, వ్యాధి నిర్ధారణకు అవరోధమని మనోజ్ శర్మ పేర్కొన్నారు. ఫార్మసీ స్టోర్లలో ఓవర్ ద కౌంటర్ ద్వారా విక్రయించే మందులను తరచుగా సేవించడం వల్ల అంతిమంగా అనాఫిలాక్టిక్ అనే (అలెర్జిక్ రియాక్షన్) సమస్యకు గురికావచ్చని డాక్టర్ విలియమ్స్ హెచ్చరించారు.
ఎంత మోతాదు..?
జ్వరం 100 డిగ్రీలకు పైగా ఉంటే రోజులో 500 ఎంజీ పారాసెటమాల్ ఒక్కసారి తీసుకోవడం సురక్షితమేనని విలియమ్స్ చెప్పారు. చాలా వరకు జ్వరాలు వైరస్ కారణంగా (వైరల్) వచ్చేవేనని, వీటికి ఈ ఔషధాలతో ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. వైద్యులు అవసరమని నిర్ధారించితే తప్ప ఔషధ సేవనం వద్దని సూచించారు. అలాగే, యాంటీ బయాటిక్స్ ను అదే పనిగా, తరచూ వినియోగించడం వల్ల యాంటీబయాటిక్ నిరోధకత ఏర్పడుతుందని డాక్టర్ మనోజ్ శర్మ చెప్పారు. చాలా వరకు జ్వరాలు వైరల్ వల్ల వస్తున్నవే కనుక వాటికి యాంటీబయాటిక్స్ తో ఉపయోగం ఉండదన్నారు. కనుక సమస్య ఏదైనా మొదటి రెండు మూడు రోజులు, ఎలాంటి ఔషధాలు వేసుకోకుండా వేచి చూసి, అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మంచిదని వీరి సూచన.