ఖమ్మం గడ్డ అజయ్ అడ్డా …కూకట్ పల్లి ఎందుకు పీకటానికా …మంత్రి పువ్వాడ
కూకట్ పల్లి నుంచి పోటీచేయను.. ఖమ్మంలోనే ఉంటా
ఇంకా దంచాల్సింది ఉంది దంచినతర్వాతనే ఇక్కడ నుంచి వెళతా
మంత్రి అజయ్ కుమార్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారిపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు . బీఆర్ యస్ సభ కోసం ఏర్పాటు చేసిన ఖమ్మం నియోజకవర్గ సమావేశంలో పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుక పడ్డారు . తాను ఖమ్మం వదిలి కూకట్ పల్లి పోతున్నానని ,అక్కడ పోటీచేస్తానని జరుగుతున్న ప్రచారం పై మండిపడ్డారు .ఖమ్మం గడ్డ అజయ్ అడ్డా …కూకట్ పల్లి ఎందుకు పీకటానికా అంటూ సోషల్ మీడియా ప్రచారం పై ఫైర్ అయ్యారు . పనికిమాలిన గ్యాంగ్ కొంతమంది ఉన్నారు . వారు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఎవరు ఎన్ని చేసిన ఇంకా దంచాల్సింది ఉంది దంచినతర్వాతనే ఇక్కడ నుంచి వెళతానని పేర్కొనడం సంచలంగా మారింది . అజయ్ మాటలకూ సమావేశానికి వచ్చిన కార్యకర్తలు జై అజయ్ , అజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించారు .
అజయ్ ప్రసంగం ఆయన మాటల్లోనే ….
కూకట్ పల్లి నుంచి పోటీచేయను..ఖమ్మంలోనే ఉంటానని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు.
రాజకీయంగా ఎదుర్కోలేక తనపై కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఖమ్మంలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులను కూకటివేళ్లతో పేకిలిస్తానని చెప్పారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలవదు.. బీజేపీ వాళ్లకు ఒక అబద్ధాల గ్రూప్ ఉందని, అజయ్ అన్న కూకట్‌పల్లి పోతుండు అని కొత్త ప్రచారం మొదలు పెట్టారన్నారు. కొంతమంది కూకట్‌పల్లి పోతడు అంటున్నారు.. అజయ్ అన్న కూకట్ పల్లి ఏం పీకటానికి పోతాడు… ఇక్కడి వాళ్ళని పీకటానికి అజయ్ అన్న ఉన్నాడు.. ఇంకా దంచాల్సిన వాళ్ళని దంచాకనే అజయ్ అన్న ఎటైనా పోతాడు.. అజయ్ అన్న సైన్యం చూసి ఎంత భయపడుతున్నారంటే.. అజయ్ అన్నను లోకల్ నుంచి పంపించి ప్రశాంతంగా ఉండాలని చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారు.
అజయ్ అన్న ఖమ్మం ను అభివృద్ధి చేసిండు.. పాత బస్టాండ్ తీసి కొత్త బస్టాండ్ పెట్టిండు.. మళ్ళీ పాత బస్ స్టాండ్ ను సిటీ బస్ స్టాండ్ గా మార్చిండు అని ఈర్ష పడుతున్నారు.. తాగడానికి నీళ్లు లేని ఖమ్మానికి గలగల నీళ్లు పారే విధంగా చేసిన.. అక్క చెల్లెళ్ల బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ బిందెల మీద సొట్టలు లేని పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్….. రెండుసార్లకు ఇవన్నీ చేస్తే మూడోసారి మనకు ముప్పతిప్పలే అని ఈ అబద్దపు నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అవకాశాన్ని 33 జిల్లాల్లో మన ఖామ్మానికి కేసీఆర్ ఇచ్చారని, ఖమ్మం మీద గాని ఖమ్మం ప్రజల మీద గాని కేసీఆర్‌కి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరే ఆలోచించండన్నారు. ఇలాంటి బంగారు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నారు. గొప్పగా మీరు వాట్సాప్ గ్రూప్ లలో ఫేస్‌బుక్ , ట్విట్టర్లు మీరు కూడా యాక్టివ్ ఉండాలన్నారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని పువ్వాడ అజయ్ కోరారు.