భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు…
- అసోంలోని గువాహటి సమీపంలో ఘటన
- ప్రియుడి సాయంతో ఘోరానికి పాల్పడిన మహిళ
- వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని అనుమానం
ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఘటన మరిచిపోకముందే, అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్త, అత్తను చంపి, ముక్కలుగా చేసింది ఓ ఇల్లాలు. తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. అసోంలోని గువాహటి సమీపంలో ఉన్న, నూన్ మటి ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది.
నిందితురాలు వందన కలితకు వివాహేతర సంబంధం కలిగి ఉండడమే ఈ హత్యలకు దారితీసినట్టు అనుమానిస్తున్నారు. భర్త అమర్ జ్యోతి దే, అత్త శంకరిదేలను, ప్రియుడి సాయంతో హత్య చేసిన వందన.. మూడు రోజుల పాటు మృతదేహాల ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి, అనంతరం మేఘాలయలోని చిరపుంజి ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను తీసుకెళ్లి, మృతదేహాల భాగాలను గుర్తించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఆ తర్వాత వాటిని సమీప అటవీ ప్రాంతంలో అక్కడక్కడ పడేయడం తెలిసిందే.