ముంబై తరఫున కొన్ని మ్యాచ్ లకు సూర్యకుమార్ నాయకత్వం!
- రోహిత్ శర్మపై పెరిగిన పనిభారం
- కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలనే యోచన
- అయినా జట్టు వెంటే వెళ్లనున్న రోహిత్
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు గత ఏడాది పేలవ ప్రదర్శనతో పది జట్లలో అట్టడుగు స్థానంలో నిలిచిపోగా.. ఈ ఏడాది ఎలాగైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. అదే సమయంలో కెప్టెన్ గా రోహిత్ శర్మకు కొన్ని మ్యాచుల్లో విశ్రాంతి ఇవ్వొచ్చన్నది తాజా సమాచారం. ఏప్రిల్ 2న తన తొలి మ్యాచ్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఈ జట్టు ఇటీవలి మినీ వేలంలో పలువురు కీలక ఆటగాళ్లను సైతం కొనుగోలు చేసింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కథనం మేరకు.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రోహిత్ కొన్ని మ్యాచుల్లో విశ్రాంతి తీసుకోవచ్చని తెలుస్తోంది. పనిభారం పెరిగిపోవడంతో, దాన్ని తగ్గించుకునేందుకు అతడు తుది జట్టులో భాగం కాకుండా, డగౌట్ లోనే కూర్చుంటాడని సమాచారం. రోహిత్ విశ్రాంతి తీసుకున్న మ్యాచ్ లను సూర్యకుమార్ యాదవ్ నడిపించనున్నాడు. ఏ మ్యాచులకు దూరంగా ఉండాలన్నది రోహిత్ శర్మే నిర్ణయించుకోనున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ ల్లో పాల్గొనకపోయినా, జట్టు వెంటే రోహిత్ శర్మ ఉండనున్నాడు.