చీమలపాడు ఘటన రాజకీయపార్టీలకు గుణపాఠం కావాలి …!
-కోర్టులు ఇలాంటి సంఘటనలు సూమోటోగా స్వీకరించాలి
-సంఘటనపై విచారణ జరపాలి
-భాద్యులపై చర్యలు తీసుకోవాలి
-భాదిత కుటుంబాలను ఆదుకోవాలి
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన సంఘటన రాజకీయపార్టీలకు గుణపాఠం కావాలి …అవసరం అయితే కోర్టులు ఇలాంటి సంఘటనలు సూమోటోగా స్వీకరించి చట్టప్రకారం భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి … ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలి …ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి …బాణాసంచా ఎక్కడ నుంచి కొన్నారు …కాల్చేందుకు అనుమతి ఉందా …? లేదా ? అనేదానిపై విచారణ జరగాలి …దీనికి పోలీస్ అనుమతి ఉందా …? ఒక వేళ ఉంటె బాణాసంచా కాల్చేప్పుడు ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలి కదా ..? ఎందుకు ఉంచలేదు …వైద్య బృందం ఉండాలి కదా … ఎందుకు లేదు …? అనేవాటికి సమాదానాలు కావాల్సిందే …
ఈ ఘటనలో అభం శుభం తెలియని అమాయకులైన 4 గురు వ్యక్తులు దారుణాతి దారుణంగా చనిపోయారు . మరికొంతమందికి తీవ్ర గాయాలైయ్యాయి . ఇద్దరికి కాళ్ళు తీసేయాల్సి వచ్చింది. మరికొందరికి రెండు కాళ్ళు తెగిపడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది . ఒకరు అక్కడికి అక్కడే చనిపోయారు . దీనికి భాద్యత ఎవరు వహించాలి …సమావేశానికి వచ్చినందుకు వారి ప్రాణాలు పోయాయని గ్రామస్తులు ఆగ్రహంతో రగిలి పోతున్నారు . అరడజనమంది కాళ్ళు చేతులు , తెగిపడ్డాయి…. ఎంపీ నామ వారు చనిపోవడానికి ఆత్మీయ సమ్మేళనానికి ఎలాంటి సంబంధం లేదని అన్నట్లు ఒక వార్త వైరల్ అయింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. ఇది ఎంపీ నామ నో లేక ఎమ్మెల్యే రాములు నాయక్ నో చేసింది కాదు …ఇలా జరగాలని ఎవరు కోరుకోరు …సంఘటన దురదృష్టకరం …కానీ సమ్మేళనం పెట్టిన పార్టీ తనకు భాద్యత లేదని తప్పించుకోజాలదు … రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు గాయపడిన వారికి 2 లక్షలు సహాయం ప్రకటించింది …. పార్టీ పరంగా ఐదు లక్షలు సహాయం అందజేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు ప్రకటించారు . ఎంపీ నామ కూడా చనిపోయిన వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా ఐదు లక్షలు చొప్పున సహాయం ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. మానవతా దృక్పధం తో స్పందించిన వారిని అభినందించాల్సిందే …ఎంత ప్రకటించిన పోయిన ప్రాణాలు తిరిగిరావు …చనిపోయినవారు కడు పేదరికంలో ఉన్న గిరిజనులు …వారి కుటంబాలకు వారే దిక్కు … అందువల్ల ప్రభుత్వం పెద్ద మనుసు తో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కరికి కోటి రూపాయలు సహాయం అందించాలని , ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా నిలవాలని ప్రతిపక్ష పార్టీలు వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . దీనిపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి …
చీమలపాడు అనేది కారేపల్లి మండలంలో ఒక చిన్న కుగ్రామం…. ఒకప్పుడు దట్టమైన అడవులకు అడవి జంతువులకు నిలయం …ఇక్కడ ప్రజలు వాటితో సహజీవనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు …
బుధవారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామం బీఆర్ యస్ సమ్మేళనానికి చుట్టుపక్కల నుంచి 10 గ్రామాల ప్రజలు రాకతో ఉలిక్కి పడింది .. వారి ఉత్సాహానికి పేల్చినా బాణాసంచా పూరి గుడిశె మీద పడి మంట దావాహంలా వ్యాపించింది. ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది దీంతో దాని శకలాలు బయట ఉన్న ప్రజలమీద పడి కాళ్ళు , చేతులు తెగిపడ్డాయి. సహాయం కోసం ఆర్తనాదాలు మిన్నంటాయి. కొద్దీ సేపట్లోనే చీమలపాడు రక్త సిక్తం అయింది. ఎక్కడ చూసిన ఏడుపులు ,పెడబొబ్బలు అటుగా వెళ్లిన తమవారికి ఏమైందోననే ఆందోళన … కుటుంబ సభ్యుల రోదనలు ఎవరెవరికి గాయాలయ్యాయని ఆరాతీయడం మొదలైంది . క్షణాల్లోనే చీమలపాడు సంఘటన ప్రపంచానికి తెలిసి పోయింది. జరిగిన సంఘటతో ఒక్కసారికి
అన్ని రాజకీయ పార్టీలు , అధికారులు, సంఘాలు దిగ్బ్రాంతి లోనైయ్యాయి.
బీఆర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు పెడుతుంది.షడ్యూల్ ప్రకారం నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలకు ఇప్పటినుంచే హంగామా సృష్టిస్తున్నారు . చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే వేదికలుగా కాకుండా ఇవి రాజకీయ పార్టీల బలప్రదర్శన వేదికలుగా మారుతున్నాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు . సమ్మేళనాలు హాజరైయ్యే వారికీ డబ్బులు ఇస్తున్నారు . రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు . ఇక భోజనాలు సాధారణమే … అంటే ప్రజలు ఇష్టంతో వచ్చే సమ్మేళనాలు కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి మరి ప్రజలను సమీకరిస్తున్నారు . అందువల్ల ఎక్కడైనా పేరు ఏదైనా దాదాపు కిరాయి సమ్మేళనాలే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి . అందులో భాగంగానే చీమలపాడును ఆత్మీయ సమ్మేళనానికి వేదికగా ఎంచుకున్నారు . దీనికి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు , స్థానిక ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ హాజరైయ్యారు .
వీరి ఉద్దేశం మంచిదే కావచ్చు….కానీ జరిగింది దారుణం ….ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి …చీమలపాడు సంఘటన అన్ని రాజకీయపార్టీలకు కనువిప్పు కావాలి …