అనారోగ్యం నుంచి కోలుకుని… పులివెందులకు చేరుకున్న వాచ్ మన్ రంగన్న!
- శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రంగన్న
- ఈ నెల 2న ఆస్తమాతో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలింపు
- తొలుత పులివెందుల నుంచి తిరుపతికి, అటునుంచి హైదరాబాద్ కు తీసుకెళ్లి చికిత్స
- వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న పులివెందులకు చేరుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన… హైదరాబాద్ లో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా తన ఇంటికి చేరుకున్నారు.
రంగన్న కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 2న ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న రంగన్నను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ కు, తర్వాత హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు.
వివేకా హత్య కేసులో రంగన్న రెండేళ్ల క్రితమే మేజిస్ట్రేట్ ముందు కీలక వాంగ్మూలం ఇచ్చారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని రంగన్న చెప్పారు. ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1 ప్లస్ 1 భద్రత కల్పిస్తున్నారు.
వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో రంగన్న అనారోగ్యానికి గురికావడం చర్చనీయాంశమైంది. ఆయనను ఆసుపత్రుల చుట్టు తిప్పడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో గతంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రంగన్నను వైద్యం పేరుతో చంపేస్తారని పులివెందులలో చర్చ నడిచింది. క్షేమంగా ఇంటికి వెళ్లడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.