ఏపీలో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల
- ఇటీవల వరుసగా 20 వేలకు పైన పాజిటివ్ కేసులు
- తాజాగా 12,994 కొత్త కేసులు నమోదు
- తూర్పుగోదావరిలో 2,652 మందికి కరోనా
- అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు
- రాష్ట్రంలో 96 మంది మృతి
- ఇంకా 2,03,762 మందికి చికిత్స
ఏపీలో మొన్నటి వరకు 20 వేలకు పైన నమోదైన రోజువారీ కరోనా కేసులు తాజాగా సగానికి సగం తగ్గాయి. గడచిన 24 గంటల్లో 58,835 కరోనా పరీక్షలు చేపట్టగా 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,652 కొత్త కేసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో 1,690 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,620 కేసులు, అనంతపురం జిల్లాలో 1,047 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అదే సమయంలో 18,373 మంది కరోనా నుంచి కోలుకోగా, 96 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 14 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,93,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 13,79,837 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,03,762 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తం మరణాల సంఖ్య 10,222కి పెరిగింది.