- మోరంచవాగు వరద తగ్గడంతో బయటపడుతున్న మృతదేహాలు
- 3 కిలోమీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు
- 153 బర్రెలు, 753 కోళ్లు కూడా మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగడంతో ఆ ఊరు మొత్తం వరదలో మునిగిపోయింది. గ్రామ ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తూ ఆర్తనాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హెలికాప్టర్లు, బోట్ల సాయంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బీభత్సానికి అప్పటికే పలువురు కొట్టుకుపోయారు.
తాజాగా మోరంచవాగు వరద తగ్గడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలు బయటపడ్డాయి. ఇద్దరి మృతదేహాలు 3 కిలోమీటర్ల దూరంలో లభించాయి. మరో ఏడుగురి ఆచూకీ లభించలేదు. ఇదే ఊరిలో 153 బర్రెలు, 753 కోళ్లు చనిపోయాయి. 50 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మొన్నటి దాకా తమ కళ్ల ముందు ఉన్న వ్యక్తులు మృత్యువాత పడటంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. మోరంచపల్లి వద్ద జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది.