కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణి పై ఆయుష్ కమిషనర్ క్లారిటీ
-నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాకే ఆనందయ్య మందు పంపిణీపై నిర్ణయం
-ఆనందయ్య మందుపై కొనసాగుతున్న అధ్యయనం
-రేపు చివరి నివేదిక వస్తుందన్న రాములు
-సోమవారం హైకోర్టులో విచారణ ఉందని వెల్లడి
-నివేదికలను అధ్యయన కమిటీ పరిశీలిస్తుందని వివరణ
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ఆయుష్ కమిషనర్ రాములు క్లారిటీ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దేశం లో అనేక మంది అనేక ప్రాంతాలలో నాటు మందు వాడటం ఆనవాయితీగా ఉంది. కొందరికి దానిపై నమ్మకం ఉంది. అందువల్ల వాటిని కట్టడి చేయడం అంటే మన సంసృతి ,సంప్రదాయాలను పక్కన పెట్టినట్లే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందయ్య మందువల్ల ఎలాంటి హానిలేదని చెబుతూనే మందు పంపిణీపై అధ్యయనాల పేరుతో మందు పంపిణి ఆపడం సరైంది కాదనే అంటున్నారు అనేక మంది …..
ఆనందయ్య కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ అధ్యయనం కొనసాగుతోంది. అటు, ఆనందయ్య మందు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ అంశాలపై ఆయుష్ శాఖ కమిషనర్ రాములు స్పందించారు. ఆనందయ్య ఔషధంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుందని వెల్లడించారు. ఔషధ పరీక్షలపై రేపు సీసీఆర్ఏఎస్ చివరి నివేదిక కూడా రానుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందని రాములు పేర్కొన్నారు. చివరి నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు వచ్చిన నివేదికలు సానుకూలంగానే వచ్చాయని అన్నారు. ఆనందయ్య మందు తీసుకున్న చాలామందిని ఫోన్ ద్వారా సంప్రదించామని, వారి సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. పంపిణీకి ముందు, ఔషధానికి ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.