- కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశమిస్తే ఏమీ చేయలేదని విమర్శ
- రైతు బంధు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు దుబారా అంటున్నారని ఆగ్రహం
- రైతుబంధును క్రమంగా రూ.16వేలకు పెంచుతామన్న కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు పదకొండుసార్లు అవకాశమిస్తే చేసిందేమీ లేదని, పైగా ఇప్పుడు మరోసారి ఛాన్స్ అంటున్నారని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారని, పెట్టుబడి సాయం ఇస్తే దుబారా అవుతుందా? అన్నారు. కర్ణాటకలో తాము ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి చెప్పారని, కానీ మనం ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతుబంధును రూ.12వేలకు పెంచి, క్రమంగా రూ.16వేలు చేస్తామన్నారు. ఓటు కిస్మత్‌ను మారుస్తుందన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా జీవితాలు కిందామీదా అవుతాయని హెచ్చరించారు.
గతంలో ఎమ్మెల్యేలు అయ్యారు కానీ వారు ధర్మపురి అభివృద్ధి చేయలేదన్నారు. ఈశ్వర్ పీరియడ్‌లో అభివృద్ధి జరిగిందని, వాగులపై చెక్ డ్యాంలు కట్టించారన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నామన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో చిమ్మచీకట్లు, మంచి, సాగునీళ్లు లేవన్నారు. వలస బతుకులు, ఎక్కడ చూసినా అంధకారమే అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక కరెంట్, తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. సాగునీటి సమస్యను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ లేదన్నారు. ప్రధాని మోదీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెబితే తాను అంగీకరించలేదన్నారు.