భర్తలు తమ భార్యలను ఎల్లప్పుడూ మత్తులో ఉంచాలన్న బ్రిటన్ మంత్రి
- భార్యలకు మత్తు మందు ఇవ్వాలన్న బ్రిటన్ హోం మంత్రి క్లెవర్లీ
- తన భర్త కంటే మెరుగైన వారు ఉన్నారన్నది తెలీకుండా ఉండేందుకు భార్యలను మత్తులో ఉంచాలని కామెంట్
- కొద్ది మొత్తంలో మత్తు ఇవ్వడం చట్ట వ్యతిరేకం కాదని వ్యాఖ్య
- ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చివరకు క్షమాపణలు చెప్పిన వైనం
కాపురాలు కలకాలం సాగేందుకు భార్యలను మత్తులో ఉంచాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ తాజాగా క్షమాపణలు చెప్పారు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల ప్రధాని రిషీ సునాక్ నివాసంలో జరిగిన ఓ విందులో మహిళా అతిథులతో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘తన భర్తకంటే మెరుగైన వారు ఎంతో మంది ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించకుండా భార్యలకు నిరంతరం కొద్ది మోతాదులో మత్తు ఇవ్వొచ్చు. కొద్దిగా ఇవ్వడం చట్ట విరుద్ధమేమీ కాదు’ అని జేమ్స్ క్లెవర్లీ వ్యాఖ్యానించారు. మహిళలు తాగే పానీయాల్లో మత్తుమందు కలుపుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలు కఠినతరం చేస్తామని ఇటీవలే ప్రకటించిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బ్రిటన్‌లో సంచలనంగా మారింది. మంత్రి రాజీనామా చేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, క్లెవర్లీ వ్యాఖ్యలు కేవలం జోక్ మాత్రమేనని, ఇందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారని మంత్రి ప్రతినిధి మీడియాకు తెలిపారు.