- రాత్రికి రాత్రే నీళ్లు తోడేసి గుడిసెను నిర్మించిన భూమాఫియా
- ట్రక్కులతో రాత్రంతా మట్టిని నింపారని తెలిపిన స్థానికులు
- దర్భంగా జిల్లాలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన
బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న ప్రదేశంలో ఒక గుడిసె వెలిసింది. ప్రభుత్వ చెరువును భూమాఫియా దొంగిలించినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చెరువులోని నీళ్లను తోడి ఇసుకతో నింపారు. ఆ ప్రదేశంలో గుడిసెను నిర్మించారు. రాత్రంతా ట్రక్కులు, యంత్రాల పనులు నిర్వహిస్తుండడంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా ఈ చెరువును చేపల పెంపకానికి, వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు ఉపయోగించేవారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెరువు ఉన్న ఆనవాళ్లు ఏమీ లేవని స్థానిక డీఎస్పీ కుమార్ తెలిపారు. గత 10-15 రోజుల వ్యవధిలో చెరువులో మట్టి నింపారని స్థానిక ప్రజలు చెబుతున్నారని, రాత్రి వేళల్లో ఈ పనులు జరిగేవని చెప్పారు. అయితే ఈ భూమి ఎవరిదనే దానిపై తమ వద్ద సమాచారం లేదని వివరించారు.