- పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- ఇందుకోసం సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు వెల్లడి
- ఈవీఎంలు సహా సామాగ్రి తరలింపు మొదలు తిరిగి స్ట్రాంగ్ రూంకు తెచ్చే వరకు పర్యవేక్షణ
పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరికట్టే ఉద్దేశ్యంలో భాగంగా పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ అధికారి వెల్లడించారు. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించినప్పటి నుంచి పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకువచ్చే వరకు పర్యవేక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తామని, తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఒకవేళ ఏమైనా అవకతవకలను గుర్తిస్తే ఎన్నికల సిబ్బంది వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. పోలింగ్‌కు వినియోగించే వాహనాల డ్రైవర్లతో పాటు పోలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను ప్రశ్నిస్తామన్నారు.