- ముఖ్యమంత్రికి ఓ న్యాయం… సామాన్యుడికి మరో న్యాయం ఉండదన్న హైకోర్టు
- అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేత
- విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదన్న హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రికి ఓ న్యాయం… సామాన్యుడికి మరో న్యాయం ఉండదని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగినట్లు హైకోర్టు పేర్కొంది. ఆయన అరెస్టును చట్టవిరుద్ధంగా చెప్పలేమని తెలిపింది. నిందితుడి అరెస్ట్ చట్టప్రకారం జరిగిందా? లేదా? అన్నది చూడాలని, కానీ ఎన్నికల సమయమని చూడవద్దని పేర్కొంది. అరెస్ట్ చేసే సమయాన్ని ఈడీ నిర్ణయించిందని భావించలేమని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీ తగిన ఆధారాలు కలిగి ఉందని తెలిపింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదని పేర్కొంది.
జైల్లోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సీఎంని ఈడీ అరెస్టు చేయడం నిబంధనలకు విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో అరెస్ట్ అనంతరం తనను ఈడీ కస్టడీకి అప్పగించడాన్ని హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ అనంతరం ఈడీ రిమాండ్‌కు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. కాగా ఢిల్లీ హైకోర్టులో చుక్కెదరవ్వడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
మరోవైపు కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరకపోయినప్పటికీ.. కేసులో కీలక వ్యక్తి కావడంతో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. విచారణలో సహకరించారని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యక్తి అని ఈడీ పేర్కొనడంతో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ నిరాకరించింది. ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం పాలసీని రూపొందించడంలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారనేందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.