- 2019 నాటి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పు
- వైవాహిక అత్యాచారం ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదన్న కోర్టు
- సెక్షన్ 375 ప్రకారం 15 ఏళ్లు పైబడిన భార్యతో భర్త శృంగార చర్యలు అత్యాచారం కాదన్న వైనం
- ఈ నేపథ్యంలో ‘అసహజ శృంగారానికి భార్య అనుమతి’ అనే అంశానికి ప్రాధాన్యం ఉండదని వ్యాఖ్య
వైవాహిక అత్యాచార ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది. 2019 నాటి కేసులో బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ ఓ మహిళ 2019లో కేసు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. సెక్షన్ 377 ప్రకారం, భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి లాయర్ వాదించారు.
ఈ కేసుపై న్యాయమూర్తి గురుపాల్ సింగ్ అహ్లూవాలియా విచారణ జరిపారు. ‘‘ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం, పదిహేనేళ్లు పైబడిన భార్యతో భర్త శృంగార చర్య అత్యాచారం కిందకు రాదు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ‘అసహజ శృంగారానికి భార్య అనుమతి’ అంశం ప్రాధాన్యం కోల్పోతుంది. తనతో పాటు ఉంటున్న భార్యతో భర్త అసహజ శృంగారం నేరం కాదని సెక్షన్ 377 చెబుతోంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, సెక్షన్ 376బీ ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం అత్యాచారమేనని స్పష్టం చేశారు. కాబట్టి, ఈ కేసులో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తీర్పు వెలువరించారు.