Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

భారీగా పెరిగిన బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు…

  • రిషి, ఆయ‌న భార్య అక్ష‌తా మూర్తి ఆస్తి సుమారు 120 మిలియ‌న్ పౌండ్లు పెరిగాయ‌న్న‌ నివేదిక‌లు
  • గ‌తేడాది 529 మిలియన్ పౌండ్లుగా ఉన్న ఈ దంప‌తుల ఆస్తులు
  • ఇప్పుడు ఏకంగా 651 మిలియ‌న్ల పౌండ్ల‌కు చేరిన వైనం
  • యూకేలోని హిందూజా గ్రూప్ సంప‌ద‌లోనూ భారీ పెరుగుద‌ల‌

బ్రిట‌న్ ప్ర‌ధానమంత్రి రిషి సునాక్‌, ఆయ‌న భార్య అక్ష‌తా మూర్తి ఆస్తులు గ‌తేడాది అమాంతం పెరిగిపోయాయి. గ‌త ఏడాది ఈ దంప‌తుల‌ ఆస్తి సుమారు 120 మిలియ‌న్ పౌండ్లు పెరిగిన‌ట్లు తాజా నివేదిక‌లు తెలిపాయి. దీంతో ఆ ఇద్ద‌రి ఆస్తి మొత్తం విలువ 651 మిలియ‌న్ పౌండ్ల‌కు చేరుకున్న‌ట్లు యూకేకు చెందిన ఐటీవీ తెలిపింది. వారి  సంపద మునుపటి సంవత్సరంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండ‌గా.. ఇప్పుడు 651 మిలియ‌న్ పౌండ్ల‌కు చేరిందని వెల్లడించింది.

కాగా, ప్ర‌స్తుత ఆర్థిక సంక్షోభ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బ్రిట‌న్‌లోని బిలియ‌నీర్ల ఆస్తులు నేల చూపులు చూస్తున్న వేళ‌.. ప్ర‌ధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు భారీగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అయితే, తండ్రి నారాయణ మూర్తి ఇండియన్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌లో అక్ష‌తా మూర్తికి అధిక‌ షేర్లు ఉన్న కార‌ణంగా వాళ్ల ఆస్తులు పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్ష‌త షేర్లు సుమారు 108.8 మిలియ‌న్ పౌండ్ల‌కు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. 

ఇక సునాక్ దంప‌తులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గ‌త ఏడాది 600 మిలియ‌న్ పౌండ్ల నుంచి 610 మిలియ‌న్ పౌండ్ల‌కు పెరిగింది. బ్రిటన్‌లోని 350 మంది సంపన్న వ్యక్తులు, కుటుంబాలు ఏకంగా 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటా వెల్లడించింది.

యూకేలోని హిందూజా గ్రూప్ సంప‌ద‌లోనూ పెరుగుద‌ల‌
యూకేలో భారతీయ హిందూజా గ్రూప్‌ను పర్యవేక్షిస్తున్న గోపి హిందూజా, అతని కుటుంబం మరోసారి బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వారి సంపద గత ఏడాది 35 బిలియన్ పౌండ్ల నుండి 37.2 బిలియన్ పౌండ్లకు పెరిగింది.

అయితే, ఆ దేశంలోని ప్రముఖ బిలియనీర్లు అంద‌రూ తమ సంపదలో వృద్ధిని సాధించ‌లేక‌పోయారు. మాంచెస్టర్ యునైటెడ్ ఇన్వెస్టర్, ఇనియోస్ వ్యవస్థాపకుడు సర్ జిమ్ రాట్‌క్లిఫ్ నికర విలువ 6 బిలియన్ పౌండ్ల మేర క్షీణించ‌డంతో 23.52 బిలియన్ పౌండ్‌లకు ప‌డిపోయింది. 

అలాగే సర్ జేమ్స్ డైసన్ సంపద కూడా 23 బిలియన్ పౌండ్ల నుండి 20.8 బిలియన్ పౌండ్లకు తగ్గింది. అటు సర్ రిచర్డ్ బ్రాన్సన్ సంపద 4.2 బిలియన్ పౌండ్ల నుండి 2.4 బిలియన్ పౌండ్లకు క్షీణించింది. గ‌త కొంత‌కాలంగా అతని కంపెనీ ఎదుర్కొన్న ఒడిదుడుకుల‌ కారణంగానే భారీగా సంద‌ను కోల్పోయిన‌ట్లు ఐటీవీ వెల్ల‌డించింది.

Related posts

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం… శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు పడుతుందట!

Ram Narayana

అమెరికా కేసు ఎఫెక్ట్… ‘అదానీ’కి షాకిచ్చిన కెన్యా ప్రభుత్వం…

Ram Narayana

5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం…

Ram Narayana

Leave a Comment