- ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న చంద్రబాబు
- చంద్రబాబు నివాసం వద్దకు రెండుసార్లు వచ్చిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
- గేటు వద్ద నుంచే వెనక్కి పంపించిన భద్రతా సిబ్బంది
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ అనుకూల అధికారిగా ముద్రపడడం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈసీ ఆయనను విధుల నుంచి తప్పించినా, అనధికారికంగా కూడా వైసీపీ కోసం పనిచేశారన్న అప్రదిష్ఠ మూటగట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు పీఎస్సార్ ఆంజనేయులు విఫలయత్నాలు చేశారు.
అపాయింట్ మెంట్ లేదని సీఎంవో కార్యాలయ అధికారులు చెప్పినప్పటికీ, చంద్రబాబును కలిసేందుకు రెండుసార్లు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్దకు వచ్చారు. దాంతో, ఆయనను చంద్రబాబు భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచే వెనక్కి పంపించారు.