గీతకార్మికులు భద్రతకే కాటమయ్య కిట్లు …మంత్రి పొంగులేటి
కుసుమంచిలో గీతకార్మికులు కిట్లను ప్రారంభించిన మంత్రి
ప్రభుత్వ భూముల్లో తాటి ,ఈత చెట్లు పెంచేలా చర్యలు
కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి
గీత కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి, గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కల్లు గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీ తో రూపొందించిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. హైదరాబాద్ ఐఐటి ప్రత్యేకంగా ఇట్టి కిట్ల రూపకల్పన చేసిందని ఆయన తెలిపారు. బిసి కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖల ద్వారా తెలంగాణ కల్లు గీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం, హైదరాబాద్ సహకారంతో సేఫ్టీ కిట్లను లబ్దిదారులకు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు . గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని ఆపద నుంచి కాపాడేందుకు ఐఐటీ నిపుణులతో ‘కాటమయ్య రక్షణ కవచం(మోకులు)’ సేఫ్టీ కిట్లను తయారు చేయించామని ఆయన అన్నారు. కులవృత్తులకు అన్ని విధాలా చేయూత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. కల్లు గీత కార్మికుల ప్రాణాలకు ప్రజా ప్రభుత్వం అభయ హస్తం కాటమయ్య రక్షణ కవచమని ఆయన అన్నారు. ఈత, తాటి వనాల పెంపు ద్వారా గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కల్లు గీత కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఇక నుంచి ఎవరూ చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేసిందని, కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్‌ను సిద్ధం చేసిందని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామని, వన మహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లలోని రోడ్ల పక్కన, చెరువుగట్లు, కాలువ గట్ల దగ్గర తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రమాదానికి గురై మరణించిన గీత కార్మికులకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.