Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సెప్టెంబర్ 17 కు చరిత్రలో అత్యంత ప్రాధాన్యత..ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి!

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

“ప్రజా పాలన దినోత్సవం.. ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. వారి ఆలోచన. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు” అని అన్నారు.

“తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. ఆ పిడికిలి పోరాటానికి సంకేతం. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం అందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17 ను కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదు” అని ముఖ్యమంత్రిగారు హితవు పలికారు.

జయ జయహే తెలంగాణ… గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా, సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చడం, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, గద్దర్ పేరిట అవార్డులు, మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేయడం వంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చేపట్టిన అనేక చర్యలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

“ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ. వారి ఆకాంక్షలే. మా కార్యాచరణ” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

సుఖేష్ తనపై చేసిన సంచలన ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్…

Drukpadam

ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలు …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

విషప్రయోగంతో 35కు పైగా కోతులను చంపిన ఆగంతుకులు.. గ్రామస్తుల్లో ఆగ్రహం!

Ram Narayana

Leave a Comment