- వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
- బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య
- రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన పీసీసీ చీఫ్
తాను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్ కుమార్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నారు. బీసీల కులగణన గురించి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీలకు లేదన్నారు. అధిష్ఠానం కోరుకున్నట్లుగా తాను నడుచుకుంటానన్నారు.
సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ అంటున్నారని, అలాంటి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలే అన్నారు. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో తెలంగాణ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతుతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. కులాలను పక్కన పెట్టి బీసీలు ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.