‘వన్ నేషన్… వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
- కేంద్ర కేబినెట్ ముందుకు రామ్‌నాథ్ కోవింగ్ కమిటీ సిఫార్సులు
- కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెబుతున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
- త్వరలోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వెళ్లే అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను నేడు కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లును కూడా ప్రవేశపెట్టవచ్చని కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ప్రతిపాదన చట్టంగా మారితే లోక్‌సభ ఎన్నికలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఆ తర్వాత 100 రోజుల్లోగా నగర, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రతిపాదనగా ఉంది.
కమిటీ సిఫార్సులు ఇవే…
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీ ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను అందజేసింది. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. సిఫారసుల అమలును పరిశీలించేందుకు ‘కార్యాచరణ బృందాన్ని’ ఏర్పాటు చేయాలని కూడా కమిటీ ప్రతిపాదన చేసింది.
ఏకకాల ఎన్నికలు నిర్వహించడం ద్వారా వనరులను ఆదా చేయవచ్చని, తద్వారా అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించవచ్చని సూచించింది. వన్ నేషన్… వన్ ఎలక్షన్ ప్రక్రియతో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయవచ్చునని, ఈ విధానం దేశ ఆకాంక్షలను సాకారం చేయడంలో తోడ్పడుతుందని అభిప్రాయపడింది.
రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఎన్నికల సంఘం ఉమ్మడి ఎలక్టోరల్ రూల్, ఓటర్ ఐడీ కార్డులను సిద్ధం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండగా.. మున్సిపాలిటీలు, పంచాయతీల వంటి స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి.
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొత్తం 18 రాజ్యాంగ సవరణలను సిఫారసు చేసింది. వీటిలో చాలా వరకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. అయితే కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదం తెలిపాల్సి ఉంది. వీటిని పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంటుంది.
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
కాగా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు మొత్తం 32 పార్టీలు, ప్రముఖ న్యాయమూర్తులు సమర్థించారని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ సహా 15 పార్టీలు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యం కాదు… కేంద్రంపై ఖర్గే, అసదుద్దీన్ విమర్శలు
- ఒకేసారి ఎన్నికల విధానం ఆచరణీయం కాదన్న మల్లికార్జున ఖర్గే
- ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని వ్యాఖ్య
- మోదీ, అమిత్ షాలకు మినహా ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదన్న ఎంఐఎం చీఫ్
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానం ఆచరణ సాధ్యంకాదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఖర్గే అభివర్ణించారు. ‘‘ఇది జరగదు. ఈ విధానాన్ని ప్రజలు ఆమోదించరు’’ అని ఆయన అన్నారు.
వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదినకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రతిపాదిత ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్‌తో సహా మొత్తం 15 విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
మోదీ, అమిత్ షాలకు మాత్రమే అవసరం: అసదుద్దీన్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా వ్యతిరేకించారు. సమస్యను సృష్టించడానికి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ఒక మార్గమని, అందుకే ఈ విధానాన్ని తాను స్థిరంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ప్రాథమిక అంశాలైన ఫెడరలిజం, ప్రజాస్వామ్యాలను ఈ విధానం నాశనం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మోదీ, అమిత్ షాలకు మినహా ఎవరికీ బహుళ ఎన్నికల విధానం సమస్య కాదని అన్నారు. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం వారికి ఉందని, అందుకే వారికి ఏకకాల ఎన్నికలు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో తరచుగా, నిర్దిష్ట కాలాలలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని అసదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికలు సాధ్యం కాదు …సిపిఐ నారాయణ
జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే విపక్షాలు స్పందించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఇది సాధ్యంకాదు ..కేవలం మోడీ ,అమిత్ షా లు మాత్రమే కోరుకుంటున్నారు …అయినా రాజ్యాంగ ప్రక్రియ జరగాలి అన్నారు .సిపిఐ జాతీయ కార్యదర్శి కె .నారాయణ స్పందిస్తూ జమిలి ఎన్నికలు నిర్ణయాన్ని తప్పు పట్టారు …