- వడ్డాడి గ్రామంలో పది మందికి పైగా కవలలు
- ఒకే రూపంలో అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు ఉండటంతో గుర్తింపునకు గ్రామస్తుల తికమక
- కవలలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వడ్డాడి గ్రామం
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు) కనువిందు చేస్తుంటారు. ఈ కవలలలో ఎవరు ఎవరో గ్రామస్తులే కాదు తల్లిదండ్రులే గుర్తు పట్టలేని పరిస్థితి ఉంటుందట. గ్రామంలో పది మందికిపైగా కవలలు ఉండటంతో వీరిని గుర్తించే విషయంలో గ్రామస్తులు తికమక పడుతుంటారు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లకు వారి తల్లిదండ్రులు పేర్లు కూడా ఆకర్షణీయంగా పెట్టారు.
గౌతమి – గాయత్రి, వర్షిత్- హర్షిత్, కావ్య – దివ్య , రామ్ – లక్ష్మణ్ ఇలా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు) ఉండటంతో పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఎవరు ఎవరో పోల్చుకోలేక తికమక పడుతుంటారు. ఒకే పోలికతో ఇద్దరు వ్యక్తులు ఉంటేనే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతుంటారు. అదే గ్రామంలో పది మందికిపైగా కవలలు కనువిందు చేస్తుండటంతో ఆ ఊరు ప్రత్యేకతను సంతరించుకుంది. గ్రామంలో కవలలు ఎక్కువగా ఉండటంతో జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా నిలవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు.