ఆడపిల్లను బతకనిద్దాం..చెరువుల్ని కాపాడుకుందాం
తల్లిదండ్రుల్లారా..మహిళలను గౌరవించడాన్ని పిల్లలకు నేర్పండి :సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క
– బతుకమ్మకు కుల,మతాల్లేవ్ : విమలక్క
– హుస్సేన్‌సాగర్ అలలసాక్షిగా సాగిన బతుకమ్మ సంబురాలు
– ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు, లేజర్‌లైటింగ్ షో
– ప్రత్యేక ఆకర్షణగా బాణాసంచా మెరుపులు
– అమరవీరుల స్మారకచిహ్నం నుంచి బతుకమ్మ ర్యాలీ
‘ఆడపిల్లలను బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. మహిళల ఎదుగుదలకు ప్రతి ఒక్కరం సహకరిద్దాం’ అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) పిలుపునిచ్చారు. మహిళలను గౌరవించడాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పాలనీ, వారిలో నైతిక విలువలను పెంపొందించాలని తల్లిదండ్రులకు చేతులెత్తి వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రజా గాయని విమలక్క, ఎమ్మెల్సీ కోదండరామ్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పలువురు కార్పొరేషన్ చైర్మెన్లు హాజరయ్యారు. సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ వరకు సీతక్క, విమలక్కతో పాటు మహిళా అధికారులు బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లారు. అక్కడ బతుకమ్మ ఆడారు. వేదిక నుంచి అక్కడకొచ్చిన వారినుద్దేశించి సీతక్క మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తన పాట ద్వారా సమానత్వం కోసం ప్రయత్నం చేస్తున్న విమలక్కకు అభినందనలు తెలిపారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ అన్నారు. తెలంగాణ అంటేనే చెరువులు, వాగులు, వంకలు, అడవులు, గుట్టలు అని చెప్పారు. చెరువులే వ్యవసాయ ప్రధాన ఆధారమనీ, అవి నిండితేనే పంటలు పండేదని అని అన్నారు. ఆ పంటల నవధాన్యాలు తెచ్చి ఆడిపాడే పండుగే బతుకమ్మ అని చెప్పారు. గునుగు పువ్వు, కట్ల పువ్వు, శంకుపూవులో ఔషధ గుణాలున్నాయనీ, అవన్నీ చెరువులో చేరితే నీరు శుద్ధి అవుతుందని అన్నారు. చెరువులను రక్షించుకుని భవిష్యత్ తరాలకు అందిద్దామనీ, జీవవైవిద్యాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. బతుకమ్మతో మన సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడుకుందామన్నారు. మహిళలకు అండగా ఉంటామని ప్రతి ఇంట్లో సోదరుడు ప్రతిన బూనాలని కోరారు. విమలక్క మాట్లాడుతూ..బతుకమ్మకు కులమతాల్లేవన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షిం చారు.
బతుకమ్మకు పూజ..వేలాదిమందితో ర్యాలీ
బతుకమ్మ సంబురాల్లో భాగంగా తొలుత తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం వద్ద బతుకమ్మకు పూజను సీతక్క నిర్వహించారు. సీతక్క, విమలక్క, తదితర ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు బతుకమ్మలను ఎత్తుకుని వేలాదిమందితో ర్యాలీగా ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లారు. ఒగ్గుడోలు కళాకారులు డోళ్లు కొడుతూ తమ నృత్యప్రదర్శన చేశారు. గుస్సాడీ, కోయ నృత్యాలను ఆదివాసీలు ప్రదర్శించారు. పలువురు మహిళలు కోలాటం ఆడుతూ ముందుకు సాగారు.
ప్రత్యేక ఆకర్షణగా క్రాకర్స్, లేజర్ షోలు
బతుకమ్మ సంబురాల్లో భాగంగా పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ సిస్టమ్‌తో ట్యాంక్‌బండ్ దైదీప్యమానంగా వెలుగొం దింది. బతుకమ్మ ఆడుతున్న సమయంలో ప్రత్యేకంగా లేజర్‌షో నిర్వహించారు. క్రాకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐదు నిమిషాల పాటు రంగురంగుల కాంతులతో నక్షత్రాలు నేలరాలు తున్నాయా? అన్నట్టు కనిపించింది. ట్యాంక్ బండ్‌కు కుటుంబస మేతంగా వచ్చినవారు క్రాకర్షోను ఆసక్తిగా తిలకించారు. సంబురాల ముగింపు సందర్భంగా సీతక్క, విమలక్క బతుకమ్మలను ఎత్తుకుని వేదిక నుంచి కిందకు దిగారు. అక్కడున్న మహిళల కోరికమేరకు మళ్లీ అక్కడ బతుకమ్మ ఆడారు.