Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత

  • ఈరోజు 7 గంటలకు ఆయన క‌న్నుమూసిన‌ట్లు ఢిల్లీ ఎయిమ్స్ వెల్ల‌డి 
  • దెబ్రాయ్‌ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం 
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విచారం

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ దెబ్రాయ్ (69) మృతిచెందారు. జీర్ణాశ‌య సంబంధిత‌ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆయన క‌న్నుమూసిన‌ట్లు ఢిల్లీ ఎయిమ్స్ వెల్ల‌డించింది.

దెబ్రాయ్‌ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “దెబ్రాయ్‌… ఆర్థిక, చరిత్ర, సంస్కృతి, రాజ‌కీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. తన రచనల ద్వారా ఆయ‌న‌ భారతదేశ మేధో రంగం మీద చెరగని ముద్ర వేశారు. భారత ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. మన ప్రాచీన గ్రంథాలపై కూడా పని చేయడం జ‌రిగింది. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన దెబ్రాయ్ గతంలో పుణేలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (జీఐపీఈ)కి ఛాన్సలర్‌గా పనిచేశారు. 2019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యుడు కూడా ఉన్నారు. మహాభారతం, భగవద్గీత, రామాయణం సహా సంస్కృత గ్రంథాలను సంక్షిప్త రూపంలో ఆంగ్లంలోకి అనువదించారు. అలాగే అనేక పుస్తకాలు, పత్రాలు, ప్రముఖ కథనాలను రచించారు. పలు వార్తాపత్రికల్లో సంపాదకుడిగానూ పనిచేశారు. 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బిబేక్ దెబ్రాయ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న‌ను ‘అద్భుతమైన విద్యావేత్త’గా అభివర్ణించారు. “డాక్ట‌ర్ బిబేక్ దెబ్రాయ్ విశిష్ట ఆర్థికవేత్త, నిష్ణాతులైన రచయిత, అద్భుతమైన విద్యావేత్త. ఆర్థిక సమస్యలపై విధానపరమైన మార్గదర్శకత్వం చేశారు. భారతదేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆర్థిక శాస్త్రం, సాహిత్యంలో వార్తాపత్రికలలో వ‌చ్చే ఆయ‌న‌ కాలమ్‌లు ఎప్ప‌టికీ నిలిచిపోయాయి” అని చెప్పుకొచ్చారు. 

Related posts

 ముంబైని అతలాకుతలం చేసిన వాన.. థానేలో విరిగిపడిన కొండచరియలు!

Ram Narayana

మళ్ళీ తెరపైకి జమిలి ఎన్నికలు …కేంద్ర కేబినెట్ ఆమోదం …జమిలి సాధ్యం కాదంటున్న విపక్షాలు

Ram Narayana

యూపీలో న్యాయమూర్తి శునకం చోరీ.. 12 మందిపై కేసు నమోదు…

Ram Narayana

Leave a Comment