- సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి పయనమవుతున్న రేవంత్
- ప్రజాపాలన విజయగాథలపై చర్చించనున్న సీఎం
- స్పీకర్ ఓం బిర్లా కుటుంబం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన హస్తినకు పయనమవుతారు.
ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో భేటీ అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయగాథలపై హైకమాండ్ తో ఆయన చర్చించనున్నారు. దీంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్ఠానంతో చర్చించనున్నారు.
వాస్తవానికి నెల రోజుల క్రితమే హైకమాండ్ తో ఈ విషయాలపై రేవంత్ చర్చించాల్సి ఉంది. అయితే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో భేటీని హైకమాండ్ వాయిదా వేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో అధిష్ఠానంతో కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులు నిర్వహించే కార్యక్రమంలో రేవంత్ పాల్గొననున్నారు.