- మాగనూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్
- స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ తీవ్రమైన అంశమన్న హైకోర్టు
- అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపాటు
- వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపైనా ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్రమైన అంశమని పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే.. అధికారులు నిద్రపోతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో మూడుసార్లు భోజనం కలుషితమైతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అని నిలదీశారు.
అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న న్యాయస్థానం.. ప్రభుత్వం ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడింది. హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆయన స్పందనపైనా న్యాయస్థానం మండిపడింది. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని ప్రశ్నించింది. ఆదేశాలు ఇస్తే కానీ పనిచేయరా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.